● తీర్పు వెలువరించిన మానుకోట జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ
మహబూబాబాద్ రూరల్ : భార్యను హత్య చేసిన భర్తకు పదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ గురువారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి జక్కి అనిల్ కుమార్ కథనం ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన పడమటింటి సోమనర్సమ్మ కూతురు రేణుకను అదే మండలం గంట్లకుంట గ్రామానికి చెందిన చింతల యాకయ్యకు ఇచ్చి 2016 ఏడాదిలో వివాహం జరిపించారు. పైళ్లెన కొంతకాలానికే తన భార్యపై అనుమానంతో యాకయ్య ఆమెను ఉరివేసి చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. ఈ ఘటనపై జనవరి 28, 2017న మృతురాలు రేణుక తల్లి సోమ నర్సమ్మ కొడకండ్ల పోలీస్ స్టేషన్ (ప్రస్తుతం పెద్ద వంగర పోలీస్ స్టేషన్ పరిధి) లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఏఎస్సై కుమారస్వామి కేసు నమోదు చేయగా అప్పటి సీఐ కరుణసాగర్ రెడ్డి.. యాకయ్యను నిందితుడిగా గుర్తించి విచారణ అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత తొర్రూరు సీఐ గణేశ్, పెద్దవంగర ఎస్సై ప్రమోద్ కుమార్, కోర్టు లైజన్ ఆఫీసర్ జీనత్ ఆధ్వర్యంలో సీడీఓ అనిల్ కుమార్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. జిల్లా కోర్టు ఇన్‌చార్జి పీపీ కొంపెల్లి వెంకటయ్య ప్రాసిక్యూషన్ పక్షాన కోర్టులో వాదనలు వినిపించారు. వాదోపవాదనలు విన్న జిల్లా కోర్టు జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ నేరం నిరూపణకాబడిన యాకయ్యకు పదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు, ప్రభుత్వ న్యాయవాది, పోలీసు సిబ్బందిని ఎస్పీ శబరీశ్ అభినందించారు.


