వర్ధన్నపేట: మ్యాట్రిమోనిలో పరిచయమైన ఓ మహిళ.. యువకుడిని మోసం చేసింది. పెళ్లి చేసుకుందామని చెప్పి అతడి నుంచి డబ్బులు తీసుకుని మోహం చాటేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం.. పట్టణానికి చెందిన బైక్ మెకానిక్ సత్యనారాయణకు మ్యాట్రీమోనిలో ఓ మహిళ పరిచమైంది. దీంతో ఇరువురు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. సదరు మహిళ భూపాలపల్లిలో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఇక్కడే ఇల్లు కొనుగోలు చేసి ఉందామని సత్యనారాయణను నమ్మించింది. అనంతరం అతడి వద్ద నుంచి రూ.20.5 లక్షల నగదు తీసుకుంది. ఇద్దరం భార్యభర్తలం కాబోతున్నామని నమ్మించి తన పేరుమీద ఇల్లు కొనుగోలు చేయించింది. తర్వాత సత్యనారాయణ పెళ్లి చేసుకుందామనడంతో మాట దాట వేసింది. దీంతో సత్యనారాయణకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో సత్యనారాయణ సదరు మహిళ వాట్సాప్‌లో ఓ యువతి ఫొటో చూసి ఆమె ఎవరని అడిగాడు. తన పిన్ని కూతురు అని సదరు మహిళ అబద్దం చెప్పింది. అయితే ఆ తర్వాత సత్యనారాయణకు ఆ యువతి సదరు మహిళ కూతురు అని తెలిసింది. దీనిపై తనకు ఎందుకు అబద్దం చెప్పి మోసం చేశావని సత్యనారాయణ అడగగా సమాధానం ఇవ్వలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సదరు మహిళపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని సత్యనారాయణ కోరుతున్నాడు.
యువకుడి నుంచి రూ.20.5 లక్షలు దండుకున్న మహిళ
లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు


