డోర్నకల్ : మండలంలోని కొత్తదుబ్బ తండాలో గురువారం జరిగిన గ్రామసభలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించి గ్రామసభ నిర్వహించారు. ఉపాధి పనులపై సిబ్బంది వివరిస్తుండగా రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందని ఓ వర్గం ఆరోపించగా మరో వర్గం వారితో ఘర్షణ పడి ఒకరినొకరు తోసుకున్నారు. ఈమేరకు శుక్రవారం డోర్నకల్‌లో జరిగే ఓపెన్ ఫోరంలో అభ్యంతరాలపై ఫిర్యాదు చేయాలని ఈజీఎస్ ఏపీఓ పార్థసారథి సూచించారు. అనంతరం పోలీసులు రెండు వర్గాలకు సర్దిచెప్పి పంపించారు. కాగా ఎంపీడీఓ కార్యాలయంలో నేడు సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఈజీఎస్ ఏపీఎం తెలిపారు.


