న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026
● 25సంవత్సరాల్లోపు వారే
సరఫరాలో కీలకం
● జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు
● ఆందోళన చెందుతున్న జిల్లా వాసులు
మహబూబాబాద్ పట్టణానికి చెందిన ముగ్గురు, మరిపెడ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఏపీ, ఒడిశా సరిహద్దులోని ఓ ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి జిల్లాలో అమ్మడానికి సిద్ధం అవుతూ పోలీసులకు పట్టుపడ్డారు. వీరంతా 18నుంచి 24సంవత్సరాల లోపు వారే కావడం గమనార్హం.
మూడు రోజుల క్రితం శనిగపురం శివారులో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులపై అనుమానం వచ్చి తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న సంచిలో గంజాయి కనిపించింది. దీనిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మేందుకు సిద్ధం అవుతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఇద్దరు యువకులు కూడా 23 సంవత్సరాలలోపు వారే.
సాక్షి, మహబూబాబాద్:
జిల్లాలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడుతున్న వారిలో అధికంగా 25సంవత్సరాలలోపు యువకులే ఉంటున్నారు. ఇందులో కొందరు సాధారణ పనులు చేసే వారు ఉండగా.. మరికొందరు చదువు మధ్యలో ఆపిన వారు ఉన్నారు. ఇంకొంద రు జులాయిగా తిరిగేవారు ఉంటున్నారు.
ఆందోళనలో జిల్లా వాసులు
జిల్లాలో చాపకింద నీరులా గంజాయి రవాణా, అమ్మకందారులు, తాగేవారి సంఖ్య పెరుగుతోంది. జిల్లా ఏర్పాటు తర్వాత మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్, హార్టికల్చర్ కళాశాలలు, పీజీ స్థాయిలో సంక్షేమ కళాశాలలు వచ్చాయి. దీంతో వేలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నారు. వీరితోపాటు పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు ఉన్న విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి రవాణా సాగుతున్నట్లు తెలిసింది. అయితే గంజాయి విక్రయించేవారు, తాగేవారు అంతా చిన్న వయస్సువారే కావడం గమనార్హం. ఈ మహమ్మారికి ఎంత మంది బానిస అవుతారో.. అందులో ఎవరి పిల్లలు ఉంటారో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. కాగా, గంజాయికి బానిసైన వారు.. ఎంజాయ్ చేయడానికి ఈజీ మనీ కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలిసింది.
చిన్న చిన్న ప్యాకెట్లుగా..
ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో అడవి మార్గం, రైలు, రోడ్డు మార్గాలను కలిపే మానుకోటజిల్లా గంజాయి రవాణాకు జంక్షన్‌గా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే యువకులు, మహిళలు బస్సులు, రైళ్లు, బైక్‌లపై ప్రయాణం చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా, కిలో నుంచి 10కిలోల వరకు గంజాయిని సాధారణ బ్యాగుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి జిల్లాకు తీసుకొస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయాలు చేయడం, హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మేవారి సంఖ్య పెరుగుతోంది. 2024లో జిల్లాలో మొత్తం 61 కేసులు నమోదు కాగా.. గత ఏడాది 73 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది రెండు నెలల్లోనే 10 కేసులు నమోదు కావడం విశేషం.
ప్రజల భాగస్వామ్యం అవసరం
గంజాయి మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య పెరగడం, ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు గంజాయి స్మగ్లర్లుగా మారడం, బానిసలుగా మారడం చూస్తే బాధేస్తోంది. అయితే గంజాయి నిర్మూలనకు జిల్లాలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థల నిర్వాహకుల సహకారం అవసరం. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం. అనుమానం వస్తే పోలీసులను సంప్రదించాలి. ఎక్కడైనా గంజాయి అమ్మకాలు జరిగితే పోలీసులకు తెలియజేయాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ప్రజల భాగస్వామ్యం ఉంటే జిల్లా నుంచి గంజాయిని తరిమేయడం సులభమే.
–శబరీష్, ఎస్పీ, మహబూబాబాద్
పెరిగిన విద్యుత్ వినియోగం!
యువకుల భాగస్వామ్యంతో గంజాయి తరలింపు
మూడేళ్లలో గంజాయి కేసుల వివరాలు
సంవత్సరం కేసులు గంజాయి(కిలోలు) విలువ అరెస్టు
2024 61 710.154 రూ.1,77,67,225 109
2025 73 252.425 రూ.1,35,71,221 122
2026 10 42.700 రూ.21,35,000 32


