మాట్లాడుతున్న మంత్రి సీతక్క, పక్కన ఎమ్మెల్సీ రవీందర్‌రావు, ఎమ్మెల్యే మురళీనాయక్, కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్,
శిక్షణకు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు
మహబూబాబాద్: గ్రామాలు అభివృద్ధి జరిగితే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లే అనే విషయాన్ని సర్పంచ్‌లు గుర్తుపెట్టుకోవాలని, ఊరికి సేవ చేస్తే తల్లిదండ్రులకు సేవ చేసినట్లుగా భావించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా డీపీఓ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షత వహించారు. ముందుగా హాల్‌లో 18 మండలాలు, ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులకు శిక్షణ మెటీరియల్ అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు సంవత్సరాలు అలస్యమయ్యాయని, దీంతో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2000 కోట్లు రావాల్సి ఉండగా రూ.600 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు. మిగిలిన నిధులు కూడా ఈనెలాఖరు వరకు వస్తాయన్నారు. సర్పంచ్‌లు లేని కాలంలో పంచాయతీ కార్యదర్శులు చేసిన ఖర్చుల విషయంలో నూతన సర్పంచ్‌లు, కార్యదర్శుల మధ్య పంచాయితీలు అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కార్యదర్శులు విధులు సక్రమంగా నిర్వహించాలని, సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలన్నారు. సర్పంచ్‌లు గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలన్నారు. దేశంలో జలశక్తి అవార్డులు ప్రకటిస్తే దానిలో 8 తెలంగాణ రాష్ట్రానికే వచ్చాయన్నారు. ఏప్రిల్ మాసంలో జాతీయస్థాయి పురస్కారాలు ఉన్నాయని, సర్పంచ్‌లు దృష్టి పెట్టాలన్నారు. ఎవరైనా కూడా చట్టానికి లోబడి పని చేయాలని, అతిక్రమిస్తే శిక్షకు గురి అవుతారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. నిబద్ధతో పని చేస్తేనే ప్రజల ఆదరణ పొందుతారన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన పెంచుకొని, అధ్యయనం చేయాలన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. శిక్షణ, అవగాహన కార్యక్రమాల ద్వారా చాలా విషయాలు తెలుస్తాయన్నారు. సర్పంచ్‌లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 10రోజుల పాటు శానిటేషన్, ఫైళ్ల క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయన్నారు. మాస్టర్ ట్రైనర్స్ ప్రజా ప్రతినిధులకు శిక్షణతో పాటు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, జిల్లా అఽధికారులు పాల్గొన్నారు.
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి
పాటుపడాలి
చట్టానికి లోబడి పని చేయాలి
నిధులు, విధులపై అవగాహన ఉండాలి
ప్రజాప్రతినిధుల శిక్షణలో మంత్రి సీతక్క


