కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ | - | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ

Mar 13 2026 8:54 AM | Updated on Mar 13 2026 8:54 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని ఢిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలో మానుకోట ఎంపీ పోరిక బలరాంనాయక్‌ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియోజకవర్గ పరిధిలోని పలు జాతీయ రహదారుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా మహబూబాబాద్‌ పట్టణ పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్‌, డోర్నకల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌, పార్లమెంట్‌ పరిధిలోని కొత్త రోడ్ల ప్రతిపాదనలు, పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ఎంపీ బలరాంనాయక్‌ కోరారు. ఎంపీ వెంట నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఉన్నారు.

ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

గార్ల: ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం ఎస్పీ శబరీష్‌ను జిల్లా పోలీసు కార్యా లయంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఎమ్మెల్యే వెంట గార్ల, బయ్యారం పీఏసీఎస్‌ మాజీ చైర్మన్లు వడ్లమూడి దుర్గాప్రసాద్‌, మధుకర్‌రెడ్డి ఉన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జీసీడీఓ విజయకుమారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో గురువారం ఎస్‌ఎఫ్‌ఐ టాలెంట్‌ టెస్ట్‌ విజేతలను సన్మానించారు. ఈ సందర్భంగా జీసీడీఓ విజయకుమారి మాట్లాడుతూ.. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు సమస్యలపై పోరాటాలు చేయడమే కాకుండా, టాలెంట్‌ టెస్ట్‌లు నిర్వహించి విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడం అభినందనీయమన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల ప్రిన్సిపాల్‌ మదార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గంధసిరి జ్యోతిబసు, పట్ల మధు, జిల్లా సహాయకార్యదర్శి రాకేష్‌, నాయకులు వీరేందర్‌, అమీర్‌, వంశీ, మహేశ్‌, సురేష్‌, చందు తదితరులు పాల్గొన్నారు.

పోక్సో కేసు నమోదు

డోర్నకల్‌: బాలికను వేధింపులకు గురిచేసిన వ్యక్తిపై డోర్నకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. ఎస్సై గడ్డం ఉమ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలికను వేధింపులకు గురి చేసిన డోర్నకల్‌కు చెందిన రాములును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

బాలుడి ముక్కులో నల్లపూస

గార్ల: మూడేళ్ల బాలుడి ముక్కులో నల్లపూస ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. మండలంలోని కంసలితండాకు చెందిన మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ నల్లపూసను ముక్కులో పెట్టుకున్నాడు. దీంతో శ్వాస తీసుకోవడంలో బాలుడు ఇబ్బంది పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు స్థానిక సీహెచ్‌సీకి తీసుకురాగా, డాక్టర్‌ హనుమంతరావు చాకచక్యంగా ఆ నల్లపూస తీసి బాలుడికి ఉపశమనం కల్పించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement