పెరిగిన బలం! | - | Sakshi
Sakshi News home page

పెరిగిన బలం!

Mar 12 2026 8:30 AM | Updated on Mar 12 2026 8:30 AM

జిల్లా నుంచి రాజ్యసభలో ఇద్దరి ప్రాతినిధ్యం

వద్దిరాజు రవిచంద్ర

వేం

నరేందర్‌

రెడ్డి

మాజీ సీఎం విధేయుడిగా ఒకరు.. ప్రస్తుత సీఎం అనుచరుడిగా మరొకరు

జిల్లా అభివృద్ధికి నిధుల సేకరణపై ఆశలు

రైల్వే మెగా మెయింటెనెన్స్‌ యూనిట్‌ మంజూరుపై నమ్మకం

సాక్షి, మహబూబాబాద్‌: ఏ ప్రాంతం నుంచి ఎక్కవ మంది ప్రజాప్రతినిధులు ఉంటే.. ఆ ప్రాంత అభివృద్ధికి పూలబాట పడుతుందనేది సత్యం. అలాంటి అవకాశమే ఇప్పుడు మారుమూల జిల్లా మానుకోటకు దక్కింది. ఏ జిల్లాలో లేనివిధంగా జిల్లా నుంచి ఇద్దరు పెద్దల సభ(రాజ్యసభ)లో ప్రాతి నిధ్యం వహించే అవకాశం వచ్చింది. ఉమ్మడి కేసముద్రం మండలానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర, వేం నరేందర్‌రెడ్డికి అవకాశం దక్కింది. దీంతో జిల్లా మరింత అభివృద్ధికి కేంద్రం నుంచి నిధుల సేకరణకు మార్గం సుగమనం అవుతుందనే ఆశాభావం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

మాజీ సీఎం విధేయుడిగా ఒకరు..

జిల్లాలోని ఇనుగుర్తి గ్రామానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు విధేయుడిగా పేరుంది. ఆ విధేయత వల్లే మొదటిసారి ఆయనను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆ తర్వాత అధికారం లేకపోయినా.. ఒక్కగానొక్క రాజ్యసభ సీటును తిరిగి రెండోసారి రవిచంద్రకే అప్పగించడం అప్పట్లో రాష్ట్రంలోనే చర్చగా మారింది. గ్రానైట్‌ వ్యాపారి అయిన రవిచంద్ర ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మహబూబాబాద్‌, కేసముద్రంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించారు. ఇదిలా ఉండగా నియోజకవర్గాల పునర్విభజనలో మహబూబాబాద్‌ జిల్లాలో జనరల్‌ నియోజకవర్గం ఏర్పడితే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

సీఎం సన్నిహితుడిగా మరొకరు..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత సన్నిహితుడు ఎవరంటే.. ఇట్టే చెప్పే పేరు మహబూబాబాద్‌ జిల్లా అర్పనపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి. ఈ సాన్నిహిత్యంతోనే ప్రభుత్వం ఏర్పడగానే సీఎం సలహాదారుగా నియమించారు. ఇప్పుడు పట్టుబట్టి రాజ్యసభ సీటు ఇప్పించారని ప్రచారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతటి పలుకుబడి ఉన్న వేం నరేందర్‌ రెడ్డి ప్రభుత్వం రాగానే కేసముద్రం, మహబూబాబాద్‌ పట్టణా లకు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. జిల్లాకు ఏ అవసరం వచ్చినా పెద్దదిక్కుగా ఉంటున్న వేం నరేందర్‌ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనరల్‌ స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

నిధుల సేకరణపై ఆశలు..

ఇప్పటికే మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌ జిల్లాకు కావాల్సిన నిధుల సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయనకు ఇప్పుడు రాజ్యసభలో ఉన్న జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర, వేం నరేందర్‌ రెడ్డి కూడా తోడు కానున్నారు. ప్రధానంగా బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కేంద్రియ విద్యాలయం నిర్మాణం, రైల్వే అండర్‌ బ్రిడ్జిల నిధులకోసం ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చు. ప్రధానంగా కేంద్ర రైల్వేశాఖ రూ.900కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిన రైల్వే మెగా మెయింటెనెన్స్‌ ప్రాజెక్టు మహబూబాబాద్‌లో నిర్మిస్తారని వార్తలు వచ్చినా.. భూ సేకరణపై ఊగిసలాడుతోంది. ఇప్పుడు ముగ్గురు నాయకులు ఢిల్లీలో ఉండి ప్రాజెక్టు తీసుకువచ్చేందుకు మరింత బలం పెరిగిందని జిల్లా ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement