మహబూబాబాద్: వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పేదలపై ఆర్థిక భారం పడుతోంది. ఇప్పటి వరకు సిలిండర్ ధర రూ.924 ఉండగా రూ.60 పెంచడంతో రూ.984కి చేరింది. ధరలు పెరుగుడే తప్ప తగ్గడం లేదని, ఆపై రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 2,11,531 కనెక్షన్లు..
జిల్లాలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ (హెచ్‌పీ సీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓ సీఎల్), భారత్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ(బీఓ సీఎల్)కి చెందిన 2,11,531 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ కనెక్షన్ల కలిగిన వారిపై ఆర్థికభారం పడనుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ చాలామందికి రావడం లేదు. అలాగే కేంద్రం ప్రభుత్వ సబ్సిడీ కూడా కొంతమంది వినియోగగారులకు రావడం లేదు. దీంతో వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పేదలపై ఆర్థికభారం..
గృహవసరాల వంట గ్యాస్ ధర రూ.60 పెరుగగా, కమర్షియల్ గ్యాస్ ధర రూ.115 పెరిగింది. దీంతో పేదలపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. ఒక వైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఆయిల్ ధరలు పెరిగాయి. వాటితో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటికి తోడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో పోషణ కష్టంగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మహిళలు కోరుతున్నారు.
ముందుగా బుక్ చేసినా కూడా..
గ్యాస్ ధరలు పెంచిన తేదీ కంటే ముందు బుక్ చేసుకున్నా కూడా డెలివరీ సమయంలో పెరిగిన ధర చెల్లించాల్సిందేనని డీలర్లు చెబుతున్నారు. ముందుగా బుక్ చేసుకున్నా కూడా ఎందుకు ఇవ్వాలని డీ లర్లతో వినియోగదారులు వాగ్వాదం చేస్తున్నారు.
పెరిగిన వంట గ్యాస్ సిలిండర్
ధరలతో పేదలపై ఆర్థిక భారం
జిల్లాలో 2,11,531 కనెక్షన్లు


