మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఇంటర్, 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులను ఇంటర్ విద్యార్థులు చితకబాదారు. ఈ దాడిలో 9వ తరగతికి చెందిన నలుగురి విద్యార్థుల శరీరంపై వాతలు పడ్డాయి. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు 9వ తరగతి విద్యార్థులు ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మెస్ భవనం వైపు నుంచి వస్తుండగా.. ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గమనించారు. రాత్రి వేళలో భవనం వెనుకకు ఎందుకు వెళ్లి వస్తున్నారని ప్రశ్నించారు. వారు నోరు విప్పకపోవడంతో చితకబాదినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 9వ తరగతి విద్యార్థుల వీపులపై వాతలు పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రైబల్ గురుకుల పాఠశాల ఎదుట మంగళవారం దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. అదేవిధంగా కొట్టిన విద్యార్థుల పట్ల పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ఈ ఘటన బయటకు రాకుండా చూశారని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.
పాఠశాల విద్యార్థులను చితకబాదిన ఇంటర్ స్టూడెంట్స్
తల్లిదండ్రులతో కలిసి బాధిత
విద్యార్థుల ఆందోళన
మహబూబాబాద్ జిల్లా మరిపెడ
మండలంలో ఘటన


