ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు షురూ..
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయని డీఐఈఓ సీహెచ్. మదార్‌గౌడ్ సోమవారం తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 12 పరీక్ష కేంద్రాలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయని, ఉదయం జరిగిన పరీక్షకు 1,155 మందికి 1,081 మంది విద్యార్థులు హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,113 మందికి 1,075 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా 112 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూని యర్ కళాశాల, శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో పరీక్షలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని, ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా మొదటిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
మహబూబాబాద్ రూరల్: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మానుకోట మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో విడత జాబితాను డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ సోమావారం ప్రకటించారు. ఒకటో వార్డు నుంచి దూపటి స్పందన, మూడోవార్డు కాలసాని నరసింహారెడ్డి, నాలుగోవార్డు బోడ సుజాత, 8వ వార్డు బానోత్ పార్వతి, 11వ వార్డు బోడ రవికుమార్, 12వ వార్డు తోట సుభాష్, 14వ వార్డు గాడిపెల్లి నాగేశ్వరరావు, 20వ వార్డు ధరావత్ హతీరాంనాయక్, 27వ వార్డు నుంచి నిమ్మల మాధవి పోటీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కేయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నిర్మల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఇంగ్లిష్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.నిర్మలను నియమిస్తూ సోమవారం కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ నర్సింహాచారి ఉద్యోగ విరమణ పొందడంతో నిర్మలను నియమించారు. ఏడాది పాటు ఆమె ఈపదవిలో కొనసాగుతారు. ఆమెకు వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు అందజేశారు.
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించండి
వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. కమిషనరేట్‌లో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా విధులు నిర్వహిస్తూ సివిల్ ఎస్సైలుగా పదోన్నతి పొందిన వేణుగోపాల్‌రెడ్డి, రాజేందర్, పర్వీన్ సోమవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు.
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహా జాతర అనంతరం రద్దీ కాస్త తగ్గడంతో భక్తులు విడిది చేసిన ప్రాంతాల్లోని చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్, ఇతర వస్తువులను సేకరించి ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. పలు సెక్టార్ల పరిధిలోని మేడారం, నార్లాపూర్, చింతల్ క్రాస్, ఊరట్టం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, కన్నెపల్లి, కొత్తూరు ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్వచ్ఛమైన మేడారంగా తీర్చిదిద్ది గ్రామస్తులకు అప్పగించాలని ఆదేశించారు. దీంతో డీపీఓ వెంకయ్య పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు షురూ..
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు షురూ..


