చేతులు కలిపారు.. | - | Sakshi
Sakshi News home page

చేతులు కలిపారు..

Feb 3 2026 7:49 AM | Updated on Feb 3 2026 7:49 AM

చేతుల

చేతులు కలిపారు..

సాక్షి, మహబూబాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పొత్తుపై సోమవారం ఉత్కంఠ వీడింది. ఇరు పార్టీల నాయకులతో డీసీసీ అధ్యక్షురాలు, సీనియర్‌ నాయకులు చర్చలు జరిపి పొత్తులను దాదాపు ఖరారు చేసుకున్నారు. మానుకోట మున్సిపాలిటీలో వారు అడిగినన్ని స్థానాలు కాకుండా.. ఉభయ కమ్యూనిస్టులకు ఐదు వార్డుల చొప్పున కేటాయించారు. అయితే అదనంగా మరోవార్డు కావాలని సీసీఐ డిమాండ్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా కమ్యూనిస్టు పార్టీలకు కేటాయించిన వార్డులనే నమ్ముకొని ఉన్న కాంగ్రెస్‌ ఆశావహులు అలగడం.. నిరాశతో ఉండడంతో వారిని నాయకులు బుజ్జగిస్తున్నారు.

పది వార్డులు.. మరోవార్డు కావాలని డిమాండ్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంతో కలిసి పోటీ చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా చెప్పిన విధంగానే చివరకు పొత్తులు ఖరారు చేశారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. మహబూబాబాద్‌ ము న్సిపాలిటీలో కమ్యూనిస్టు పార్టీలు పోటీకి సిద్ధమయ్యారు. ముందుగా సీపీఐ 15 వార్డులు, సీపీఎం 8వార్డుల్లో బలం ఉందని, ఆయా వార్డులు కేటాయి ంచాలని అడిగారు. అయితే డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ, మాజీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మురళీనాయక్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి వారితో చర్చించారు. సీపీఎంకు ఐదు వార్డులు ఇస్తామని ముందుగా నాలుగు వార్డులు ప్రకటించారు. అదే విధంగా సీపీఐకి కూడా ఐదు వార్డులు ఇస్తామని చెప్పారు. దీనిపై సీపీఎం సరే అనగా.. సీపీఐ మాత్రం ససేమిరా అంది. దీనిపై సోమవారం ఉదయం నుంచి సాయత్రం వరకు తర్జనభర్జన జరిగింది. ఇలా సీపీఎంకు 15,16,29,30వ వార్డులతో పాటు 4వ వార్డు కూడా ఇస్తామని అంగీకరించారు. ఇందులోని నాలుగు వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీలో లేరు. నాల్గో నంబర్‌ వార్డులో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ వేశారు. అదే విధంగా సీపీఐకి 19, 21,25,33, 36వ వార్డులు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించింది. అయితే మరో వార్డు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ వేం నరేందర్‌రెడ్డికి సీపీఐ నేతలు రాయభారం పెడుతున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్‌ నాయకుల బుజ్జగింపు

మొదటి నుంచి పోటీకి సిద్ధమైన కాంగ్రెస్‌ నాయకులకు సీపీఐ, సీసీఎం పొత్తులు కొరగాని కొయ్యగా మారాయి. ఆయా వార్డులనే నమ్ముకున్న వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఇప్పటికే పలు వార్డుల్లో రిజర్వేషన్‌ కలిసి రాకపోవడంతో వేరే వార్డులను వెతుక్కొని ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ వార్డులను వామపక్షాలకు కేటాయించడంతో పలువురు నాయకులు డీసీసీ అధ్యక్షురాలు ఎదుట అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వీరిని బుజ్జగించేందుకు మరొక వార్డు టికెట్‌ ఇవ్వడం.. మరో అవకాశం ఇస్తామని సర్దిచెబుతున్నారు.

మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో

కాంగ్రెస్‌తో కమ్యూనిస్టు పార్టీల పొత్తు

సీపీఐ, సీపీఎంకు ఐదు వార్డుల

చొప్పున కేటాయింపు

ఆ వార్డుల్లోని కాంగ్రెస్‌ ఆశావహులను బుజ్జగిస్తున్న నాయకులు

చేతులు కలిపారు..1
1/1

చేతులు కలిపారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement