సోలార్ సొబగులు..
ఉమ్మడి జిల్లాలో 9 గ్రామాలు ఎంపిక..
పైలట్ గ్రామాల్లో సంపూర్ణ సౌర విద్యుత్ వెలుగులు
హన్మకొండ: సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ గ్రామా లను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వమే ఖర్చులు భరించి పైలట్ గ్రామాల్లోని ప్రతీ ఇల్లు, ప్రతీ వ్యవసాయ పంపుసెట్‌ను సౌర విద్యుతీకరిస్తోంది. రూ.1,380 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాలను పూర్తిగా సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ పల్లెలుగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ పథకం బహుళ ప్రయోజనకారిగా ఉంది. ప్రభుత్వమే ఖర్చు భరిస్తుండడంతో వినియోగదారులపై ఏ మాత్రం ఆర్థిక భారం పడడం లేదు. దీంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా సౌర విద్యుత్ మారనుంది. ఉత్పత్తి అయిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా వినియోగదారుడికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. మార్చి నాటికి పైలట్ గ్రామాల్లో సంపూర్ణంగా సోలార్ వెలుగులు నిండనున్నాయి.
ఒక్కో ఇంటిపై 2 కిలో వాట్లు, వ్యవసాయ పంపుసెట్లకు 7.5 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతీ ఇంటికి రూ.1.36 లక్షలు, ప్రతీ వ్యవసాయ బావికి రూ.4.85 లక్షలు ప్రభుత్వం భరిస్తుంది. ప్రతీ ఇంటికి నెట్ మీటర్ బిగిస్తారు. ఈ మీటర్ ఇంటికి వినియోగిస్తున్న విద్యుత్, మిగతా విద్యుత్ గ్రిడ్‌కు ఎంత సరఫరా జరిగిందో యూనిట్ల వారీగా రికార్డు చేస్తుంది. అదే విధంగా వ్యవసాయ పంపుసెట్లకు బిగించే నెట్ మీటర్ గ్రిడ్‌కు సరఫరా చేసే విద్యుత్‌ను మాత్రమే రికార్డు చేస్తుంది. వ్యవసాయానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో ఈ వినియోగాన్ని రికార్డు చేయదు. ప్రతీ ఇంటిపై ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా నెలకు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే విధంగా వ్యవసాయ పంపు సెట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా వెయ్యి యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయ పంపుసెట్ల వద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం యూనిట్‌కు రూ.2.59 చొప్పున చెల్లిస్తుంది. దీని ద్వారా రైతుకు నెలకు రూ.2,590 ఆదాయం వస్తుంది. అలాగే, గృహ సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతీ యూనిట్‌కు రూ.4.99 చొప్పున చెల్లిస్తుంది. అయితే ఇంటికి వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌కు మాత్రమే చెల్లింపులు చేస్తారు.
ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పలకల బిగింపు
ప్రతీ ఇల్లు, వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్
ఇంటికి 2 కిలో వాట్లు,
వ్యవసాయానికి 7.5 కిలో వాట్లు
రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరు
యూనిట్‌కు రూ.2.59 చెల్లింపు
7.5 కిలో వాట్ల సామర్థ్యంతో
నెలకు వెయ్యి యూనిట్లు ఉత్పత్తి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 9 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు సోలార్ పలకల బిగింపు కార్యక్రమం మొదలైంది. వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలం పోతిరెడ్డి పల్లి, కిష్టాపూర్, ములుగు జిల్లాలో ములుగు మండలం జగ్గన్నపేట, అన్నంపల్లి, చిన్నగుంటూరుపల్లి, పులిగుండం, హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు, ఎల్క తుర్తి మండలంలోని కేశవాపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారాన్ని పైలట్ గ్రామాలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ గ్రామాలన్నింటిలో మొత్తం 3,854 గృహాలకు 7,708 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ పలకలు బిగించనున్నారు. అదే విధంగా 1,729 వ్యవసాయ విద్యుత్ సర్వీస్‌లకు 12967.5 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పలకలు బిగిస్తారు. దీంతో ఈ గ్రామాలన్నీ సోలార్ మయం కానున్నాయి.
సోలార్ సొబగులు..


