రాజీ మంత్ర..
సాక్షి, మహబూబాబాద్: ‘ఆ వార్డుల్లో ఇద్దరు మన పార్టీ వారే నామినేషన్ వేశారు.. ఆ ఇద్దరు కార్యకర్తలు బలమైనవారు.. మీరు చెబితే వారు వింటారు.. లేకపోతే ఇద్దరు పోటీలో ఉంటారు.. అది మనం గెలిచే సీటు.. ఇద్దరు పోటీలో ఉంటే ఓడిపోతాం.. ఎలాగైనా ఒకరు నామినేషన్ ఉపసంహరించుకునేలా చూడండి. నేను చెప్పేది చెబుతున్నా.. ఇద్దరు మొండిగానే ఉన్నారు.. సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాను.. ఇద్దరు నాకు ముఖ్యమే.. ఎవరిని వద్దని అనాలో అర్థం కావడం లేదు.’ ఈ సంభాషణ సోమవారం ఇద్దరు కీలక బీఆర్‌ఎస్ నాయకుల మధ్య జరిగింది. ఇలా ప్రతీ వార్డులో రెబల్ అభ్యర్థులు నామినేషన్ వేయడంతో నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇద్దరు పోటీపడితే..
ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 98 వార్డులు ఉన్నాయి. 906 నామినేషన్లు వచ్చాయి. ఇందులో ఒక్కొక్కరు రెండు సెట్లు వేయడం, రెండు, మూడు వార్డులకు పోటీ చేసిన వారు కూడా ఉన్నారు. వీరుపోగా.. కాంగ్రెస్ పార్టీ పేరుచెబుతూ 267మంది, బీఆర్‌ఎస్ పేరు చెబుతూ186 మంది నామినేషన్లు వేశారు. అంటే కాంగ్రెస్ నుంచి 169 నామినేషన్లు, బీఆర్‌ఎస్ నుంచి 88 నామినేషన్లు రెబల్ అభ్యర్థులు వేసినట్లు అంచనా వేస్తున్నారు. అయితే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కన్నా.. అధికార కాంగ్రెస్ పార్టీలోనే రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ప్రతీ వార్డులో నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. ఈ పరిస్థితిలో ఏ పార్టీ నుంచి ఇద్దరు బరిలో ఉన్నా.. ఎదుటి పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయం కానుంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో రెబల్స్ బెడద
నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బుజ్జగింపులు
నేడు విత్‌డ్రాకు చివరి గడువు
నేడు చివరి గడువు..
నామినేషన్ వేయడం ఎంత కీలకమో.. ఉపసంహరణ సమయం కూడా అంతే కీలకంగా మారింది. అయితే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకునేలా ప్రధాన పోటీదారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నామి నేషన్ వేసిన నాయకుడి బలం అంచనా వేయడం, అనుచరులతో చెప్పించే పనిలో ఉన్నారు.. ఇంతకాలం చేసిన ఖర్చుల వివరాలు తెలుసుకొని వాటికి తోడు అదనంగా డబ్బులు ఇచ్చి బతిమిలాడే పనిలో ఉన్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివర రోజు కావడంతో సోమవారం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చర్చలు, మంతనాలు, బుజ్జగింపులు, ఇతర పనుల్లో నాయకులు, పోటీదారులు నిమగ్నమయ్యారు.


