పొత్తు పొడిచేనా? | - | Sakshi
Sakshi News home page

పొత్తు పొడిచేనా?

Jan 8 2026 8:55 AM | Updated on Jan 8 2026 8:55 AM

పొత్త

పొత్తు పొడిచేనా?

సాక్షి, మహబూబాబాద్‌: ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట మానుకోట. సాయుధ పోరాటం మొదలుకొని.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషి ంచారు. పేదలకు ఇళ్లు, కార్మికులు, కర్షకుల హక్కు ల కోసం అనునిత్యం పోరాటాలు చేసిన ఘనత ఈ ప్రాంత కమ్యూనిస్టులకు దక్కింది. అందుకోసమే దొరలు, భూస్వామ్యులను ఎదిరించి ప్రజల అండతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక పదవులు అలంకరించిన చరిత్ర ఉంది. అయితే క్రమంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితిలో పార్టీల ప్రతిష్టను కాపాడాలంటే ఇతర పార్టీలతో పొత్తులు అనివార్యమని కామ్రేడ్స్‌ అంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతూనే.. పొత్తుల విషయంపై కసరత్తు ప్రారంభించారు.

కాంగ్రెస్‌తో సీపీఐ దోస్తీ..

సార్వత్రిక ఎన్నికల నుంచే సీపీఐ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేస్తోంది. దీనికి ఫలితంగానే రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు సుధాకర్‌ రెడ్డికి మరిపెడ డివిజన్‌ ఆత్మ కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చారు. ఈమేరకు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సముచిత స్థానం ఉంటుందని సీపీఐ నాయకులు చెబుతున్నారు. పార్టీ బలం ఎక్కువగా ఉన్న మహబూబాబాద్‌లో గత మున్సిపల్‌ ఎన్నికల్లో 12 వార్డుల్లో పోటీ చేసి రెండు గెలిచామని, మిగిలిన చోట్ల కూడా స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యామని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ సారి మహబూబాబాద్‌లో 18 వార్డులతో పాటు, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌, కేసముద్రం మున్సిపాలిటీల్లో రెండేసి స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని, కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఈ పోటీ ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఇప్పటికీ ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. పొత్తు ఉంటే ఉండవచ్చు.. కానీ వారు అడిగినన్ని వార్డులు ఇచ్చే పరిస్థితి ఉండబోదని ఆ పార్టీలోని కొందరు కీలక నాయకులు చెబుతున్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ఇరు పార్టీల మధ్య పొత్తు విషయంపై స్పష్టత రానుంది.

సీపీఎం దారెటు..?

ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీతో స్నేహపూర్వక పొత్తు, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపుకోసం ప్రచారం.. సర్పంచ్‌ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేసిన సీపీఎం మున్సిపల్‌ ఎన్నికల్లో ఏపార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనే విషయంపై కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్‌, సీపీఐ పొత్తులు ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం పొత్తు పెట్టుకుంటే ఆశించినన్ని వార్డులు ఇచ్చే పరిస్థితి కనిపిండం లేదు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో మానుకోట మున్సిపాలిటీల్లో ఎనిమిది స్థానాల్లో పోటీచేసిన సీపీఎం రెండు స్థానాల్లో గెలిచింది. మిగిలిన స్థానాల్లో కొన్నింటిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు కూడా మానుకోటలో 10 వార్డులతోపాటు, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్‌ మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు తగ్గకుండా పోటీలో ఉండేందుకు సమాయత్తం అవుతున్నారు. అయితే సీపీఎంతో పొత్తుకు జిల్లాలోని ఇరు పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే.. రాష్ట్రంలో ఆ పార్టీ బీజేపీతో జతకంటే అవకాశం ఉందనే ఊహగానాల నేపథ్యంలో సిద్ధాంతపరమైన విభేదాల వల్ల బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీచేసే అవకాశం లేదు. అదే విధంగా కాంగ్రెస్‌లోని ఓ పెద్దనాయకుడు ఇటీవల వామపక్ష పార్టీలతో పొత్తుపెట్టుకొని మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్తామని చెప్పిన మాటలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే కమ్యూనిస్టులు గెలిచే స్థానాలు తక్కువగా ఉన్నా.. వారి ఓట్లతో ఇతర పార్టీలను ఓడించడం, గెలిపించే సత్తా ఉన్నట్లు కామ్రేడ్స్‌ అంటున్నారు. చైర్మన్‌ పదవులు దక్కించుకునేందుకు కమ్యూనిస్టులతో పొత్తు కీలకంగా ఉంటుందని ఉభయ కమ్యూనిస్టుల వాదన. ఈ పరిస్థితిలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మున్సిపల్‌ ఎన్నికలపై కామ్రేడ్స్‌ కసరత్తు

పొత్తులు అనివార్యంగా కమ్యూనిస్టుల ఎత్తుగడలు

కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఐ సిద్ధం

సీపీఎం పొత్తుపై సందిగ్ధం

పొత్తు పొడిచేనా?
1
1/1

పొత్తు పొడిచేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement