మేడారానికి ఆర్టీసీ సర్వీసులు
నెహ్రూసెంటర్: మేడారం మహాజాతరకు మహబూబాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 9నుంచి మేడారం జాతరకు డిపో నుంచి బస్సులు నడపనున్నారు. ప్రతీరోజు ఉదయం 6గంటల నుంచి బస్సులు బయలుదేరుతాయని అధికారులు తెలిపారు. మేడా రం జాతర, సంక్రాంతి పండుగ వస్తుండడంతో ఆర్టీసీ ఇటు భక్తులు, అటు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు, బస్సుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా మేడారం జాతరకు 130 ప్రత్యే బస్సులను రద్దీకి అనుగుణంగా నడిపించనున్నారు. సంక్రాంతి వేళ ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
‘మహాలక్ష్మి’ ద్వారా ఉచిత ప్రయాణం..
మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేలా ఆర్టీసీ అనుమతినిచ్చింది. వనదేవతల జాతరకు రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల ద్వారా జాతరకు వెళ్లి తిరిగి రావా లని అధికారులు సూచిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నేరుగా వనదేవతల గద్దెల వద్దకు చేరుకోనున్నాయి. కాగా, మానుకోట నుంచి జాతరకు పెద్దలకు రూ.260, పిల్లలకు రూ.160గా టికెట్ ధరలను ఆర్టీసీ నిర్ణయించింది.
సంక్రాంతికి సన్నద్ధం..
మేడారం జాతరతో పాటు ఈ నెలలో సంక్రాంతి పండుగ వస్తుండడంతో ఆర్టీసీకి మరింత ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ప్రస్తుతం ప్రతీ రోజు డిపో నుంచి 35 వేల మంది ప్రయాణికులను చేరవేస్తుండగా.. ఈ సంఖ్య ఈ నెలలో మరింత పెరగనుంది. డిపోలో 74 బస్సులు ఉండగా ప్రయాణికుల తాకిడి పెరిగితే ఇతర డిపోల నుంచి బస్సులను తరలించనున్నారు. సంక్రాంతి ప్రత్యేక బస్సులను ఈ నెల 10నుంచి నడిపించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చు. మహబూబాబాద్ డిపో నుంచి బస్సులను మేడారం జాతరకు ఏర్పాటు చేశాం. అదే విధంగా రానున్న సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపనున్నాం. భక్తులు, ప్రయాణికులు ఆర్టీసీ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
–వి.కల్యాణి, డిపో మేనేజర్, మానుకోట
రేపటి నుంచి జాతరకు బస్సులు ప్రారంభం
సంస్థకు కలిసొచ్చిన జాతర,
సంక్రాంతి సీజన్
రద్దీకి అనుగుణంగా బస్సుల ఏర్పాటుకు
కసరత్తు
మేడారానికి ఆర్టీసీ సర్వీసులు


