సీసీ కెమెరాల నిఘా
● వ్యవసాయ మార్కెట్‌లో 28 ఏర్పాటు
మహబూబాబాద్ రూరల్ : రైతుల వ్యవసాయ పంట ఉత్పత్తుల రక్షణ నిమిత్తం మానుకోట వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో నూతనంగా సీసీ కెమెరాల (నిఘా నేత్రాలు) ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ సుజన్ బాబు ఆధ్వర్యంలో నూతనంగా 28 అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించే పని మొదలుపెట్టారు. యార్డు పరిధిలో రైతులకు అందిస్తున్న సేవల్లో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని వారు పేర్కొన్నారు.
నారాయణపురం భూముల రీ సర్వేకు గెజిట్ విడుదల
కేసముద్రం: మండలంలోని నారాయణపురం గ్రామానికి సంబంధించిన భూములను లెక్కించి అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రీ సర్వేకు గెజిట్ విడుదల చేసింది. 2017లో నెల్లికుదురు మండల పరిధిలోని చిన్నముప్పా రం రెవెన్యూ గ్రామం నుంచి నారాయణపురం విడిపోయి కేసముద్రం మండలంలో కలిసింది. ఈ క్రమంలో పలువురు రైతుల పట్టాభూములు ధరణి పోర్టల్ రికార్డుల్లో అడవి భూములుగా నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తమ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని పలుమార్లు రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు ఎంజాయిమెంట్ సర్వే నిర్వహించారు. కొంతమంది రైతులకు పాసు పుస్తకాలు అందించినప్పటికీ మరికొంత మందికి రాకపోవడంతో ప్రభుత్వ పథకాలకు, రుణాలకు దూరమై తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నారాయణపురం గ్రామ భూముల రీ సర్వే నిర్వహించాలని బుధవారం ప్రత్యేకంగా గెజిట్‌ను విడుదల చేసింది. గ్రామ సరిహద్దులు నిర్ణయించి అధికారులు సర్వే నిర్వహించనున్నారు.
సీసీ కెమెరాల నిఘా


