
పేదల ఆపిల్.. సీతాఫలం
హన్మకొండ కల్చరల్: పేదల ఆపిల్ సీతాఫలం. అ మృతంలా తియ్యగా ఉండే ఈ పండును ఇష్టపడని వారుండరు.. పిల్లల నుంచి పెద్దల వరకు.. సామాన్యల నుంచి సంపన్నుల వరకు ఇష్టంగా తినే పండు సీతాఫలం. వర్షాకాలంలో లభించే సీతా ఫలానికి పోషకగనిగా పేరుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో లభించే సీతాఫలాల విక్రయాలు నగర, పట్టణాల్లో జోరందుకున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ ప్రభావంతో కొంత మేర సీతాఫల చెట్లు అంతరించిపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ అయినా సీతాఫలాల దిగుబడి తగ్గి ధరలు పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, తరిగొప్పుల, తొర్రూరు, మహబూబాబాద్, మరిపెడ, ఏటూరునాగరం, కొత్తగూడ, నర్సంపేట, గూడూరు, పాకాల, వర్ధన్నపేట, పర్వతగిరి, స్టేషన్‌ఘన్‌పూర్, మరిపెడ, న ర్సింహులపేట, ములుగు, భూపాలపల్లి, పరకాల, ములుగు గణపురం తదితర మండలాల్లో ఎక్కువగా లభిస్తుండగా.. వీటిని కూలీలు గుట్టలు, పొలాల గట్లు, అటవీ ప్రాంతాల నుంచి సేకరించి ఎడ్ల బండ్లు, వాహనాల్లో నగరానికి తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.
జోరుగా సీతాఫలాలు విక్రయాలు
సీతాఫలాలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వరంగల్ ట్రైసిటీలో పబ్లిక్ గార్డెన్ సెంటర్, వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్, పండ్ల మార్కెట్, ఇతర నగర రహదారులపై సీతాఫలాల విక్రయాలు సాగుతున్నాయి. ఎక్కువ శాతం మహిళలే అమ్మడం కనిపిస్తోంది. గతంలో 100 పండ్లు రూ. 150 నుంచి రూ. 200 వరకు విక్రయించేది. ప్రస్తుతం ఈఏడాది ఒక పండు రూ. 10 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నారు. పెద్ద పరిమాణమైతే రూ.100కు నా లు గు చొప్పున విక్రయిస్తున్నారు. మరికొంత మంది సేకరించిన వారి నుంచి గుత్తగా తీసుకుని దుకాణా ల ద్వారా అమ్ముతున్నారు. ఈ విక్రయాల ద్వారా రోజుకు సేకరించిన కాయలను బట్టి సుమారు రూ.2వేల నుంచి రూ.10వేల వరకు ఆదాయం వ స్తుంది. సీతాఫలాల విక్రయాలు, సేకరణతో ఏటా పేదలకు మూడునెలల పాటు ఉపాధి లభిస్తుంది. తెల్లవారుజామునే నగరానికి చేరుకుని విక్రయాలు పూర్తయిన అనంతరం సాయంత్రానికి తమ గ్రామానికి వెళ్తున్నారు. కొన్ని కుటుంబాలు పబ్లిక్‌గార్డెన్ వద్ద రోడ్డు పక్కన షెడ్డు వేసుకుని సేకరించిన కాయలను మాగబెట్టి అమ్ముతున్నారు. సీజన్ అయిపోయినా తర్వాత తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోతారు.
ఏటేటా అంతరిస్తున్న సీతాఫలం చెట్లు
రియల్ స్టేట్ వ్యాపారం, కరువు ప్రభావంతో సీతా ఫలాల చెట్లు ఏటేటా అంతరించిపోతున్నాయి. బా వులు, పొలగట్లు, గుట్టలు వెంట ఉన్న సీతా ఫలాల చెట్లను కూడా యంత్రాలతో తొలగించి భూములను చదును చేసి విక్రయిస్తున్నారు. ఫలితంగా సీతాఫలం చెట్లు అంతరిస్తున్నాయి. నాణ్యత, పరిమాణాన్ని బట్టి రూ.10 నుంచి రూ. 20, 30 వరకు పండ్లు విక్రయిస్తున్నారు.
కోతుల బెడదతో కాయలు కరువు..
గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు ఉన్నా కోతులు పూత, కా య దశలో తెంపుతున్నాయి. ఫలితంగా అక్కడ సీ తాఫలాల కనిపించని పరిస్థితి నెలకొంది. కాగా, కొంత మంది వ్యాపారులు తమ పంట పొలాలు, గట్ల వెంట పెంచిన సీతాఫలాల చెట్లకు పగలు, రా త్రి నిఘా ఉంటూ కోతుల బెడద నుంచి రక్షించుకుంటున్నారు. దీంతో 2 వేల నుంచి 5వేల వరకు కా యలు దిగుబడికి వస్తున్నాయి. అనంతం వీటిని నగరానికి తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నామని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు.
పోషకాలు మెండు.. ఈ పండు
కంటి, గుండె, జీర్ణ సంబంధం
సమస్యలు దూరం
ఆపిల్‌తో పోటీ పడుతున్న
సీతాఫలాల ధరలు
మూడు నెలల పాటు విక్రయాలు..
పేదలకు ఉపాధి
రియల్ ఎస్టేట్ విస్తరణలో
అంతరిస్తున్న చెట్లు