
ఎఫ్‌పీఐ పనులు వేగవంతం చేయాలి
హన్మకొండ: విద్యుత్ లైన్లలో తలెత్తే సమస్యలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేస్తున్న ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల (ఎఫ్‌పీఐ) బిగింపు పనులు వేగవంతం చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీటి ద్వారా సమస్య ఎక్కడ ఉందో త్వరగా గుర్తించి వెంటనే పునరుద్ధరించొచ్చన్నారు. వినియోగదారులకు విద్యుత్ అంతరాయం సమయం తగ్గుతుందన్నారు. 11 కేవీ కలిపి ఉన్న ఫీడర్లను వేరు చేయడం ద్వారా ఆ ఫీడర్‌లో అంతరాయాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల డిజిటలైజేషన్‌తో ఎంత లోడ్ ఉందో సులువుగా తెలుసుకోవచ్చని తెలిపారు. హెచ్‌టీ సర్వీస్‌లో ఆటోమేటిక్ రీడింగ్ మోడెం అమర్చే పనులు వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న వర్క్‌ఆర్డర్లు పూర్తి చేయాలని సూచించారు. సబ్ స్టేషన్లను స్కాడాకు అనుసంధానించడం వలన విద్యుత్‌కు సంబంధించిన పూర్తి సమాచారం వేగంగా తెలుసుకోవచ్చని వివరించారు. రెవెన్యూ కలెక్షన్లు వంద శాతం వసూలు చేయాలని, వ్యవసాయ సర్వీసుల మంజూరు వేగవంతం చేయాలని, డోర్‌లాక్ ఉన్న మీటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎండీ ఆదేశించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్‌లాల్, అశోక్, వెంకటరమణ, సీజీఎంలు ఆర్.చరణ్‌దాస్, జీఎంలు వెంకటకృష్ణ, అన్నపూర్ణ, నాగప్రసాద్, వేణుబాబు, కృష్ణమోహన్ పాల్గొన్నారు.