
మరింత ఆసరా!
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆసరాగా నిలుస్తోంది. ఇప్పటికే నెలకు రూ. 4016 పింఛన్, బస్సు, రైలు సౌకర్యం, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం మరింత బాసటగా నిలుస్తోంది. వారికి స్కూటీలు, బ్యాటరీతో నడిచే వాహనాలు, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అందజేస్తోంది.
అదనపు కలెక్టర్ కన్వీనర్‌గా..
ప్రభుత్వం నుంచి 144 యూనిట్లు మంజూరు అయ్యాయి. ఈమేరకు జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 359 దరఖాస్తులు వచ్చాయి. అదనపు కలెక్టర్(స్థానికసంస్థలు) కన్వీనర్‌గా, జిల్లా సంక్షేమాధికారితో పాటు, వైద్యారోగ్యశాఖ, రవాణాశాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు.
ఎంపిక ఇలా..
వచ్చిన దరఖాస్తుల్లో 40శాతం అంగవైకల్యం, కళాశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యే డిగ్రీ, పీజీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత నిరుద్యోగులకు అవకాశం ఇస్తారు. ఇందులో 33శాతం మహిళలకు కేటాయిస్తారు. వీటితోపాటు పదో తరగతి మెమో ఆధారంగా 18సంవత్సరాల నుంచి 55ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారిని మాత్రమే అర్హులుగా గుర్తిస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రాతిపదికన యూనిట్లు అందజేస్తారు. ఇందుకోసం బోనాఫైడ్, నివాసం, కుల ఽధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, అర్హుల జాబితా తయారు చేస్తారు. కలెక్టర్ ఆమోదం పొందిన జాబితా ప్రకటించి పరికరాలు అందజేస్తారు.
దళారుల రంగప్రవేశం
ప్రభుత్వం నుంచి దివ్యాంగులకు తాము ఉచితంగా వాహనాలు, పరికరాలు ఇప్పిస్తామని పలువురు దళారులు దరఖాస్తుదారులతో బేరసారాలు ఆడుతున్నట్లు ప్రచారం. ప్రధానంగా స్కూటీలు, బ్యాటరీ ట్రై సైకిళ్లకు ఎక్కువ దరఖాస్తులు రావడం, వాటి విలువ కూడా ఎక్కువగానే ఉండడంతో తమకు డబ్బులు ఇస్తే యూనిట్ ఇప్పిస్తామని చెబుతున్నట్లు ప్రచారం. దీంతో అన్ని అర్హతలు ఉండి తమకు స్కూటీ, ఇతర యూనిట్లు వస్తాయని ఆశపడుతున్న వారు ఆందోళన చెందుతున్నారు.
ఎంపిక పారదర్శకంగా ఉంటుంది
ప్రతీ పరికరం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తాం. కమిటీ పూర్తి స్థాయిలో సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే నిజమైన లబ్ధిదారులకు యూనిట్లు అందజేస్తాం. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత ఎంపిక జాబితా ప్రకటిస్తాం. యూనిట్లు పంపిణీ చేస్తాం.
–శిరీష, డీడబ్ల్యూఓ, మహబూబాబాద్
దివ్యాంగులకు వాహనాలు, పరికరాలు
144 యూనిట్లు.. 359 దరఖాస్తులు
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
స్కూటీలకు డిమాండ్,
దళారుల బేరసారాలు
యూనిట్లు, వచ్చిన దరఖాస్తుల వివరాలు
యూనిట్లు సంఖ్య వచ్చిన
దరఖాస్తులు
స్కూటీ 55 229
బ్యాటరీ వీల్‌చైర్స్ 16 43
బ్యాటరీ ట్రైసైకిళ్లు 22 09
బ్యాటరీ
మినీట్రైడింగ్ ఆటో 01 26
హైబ్రిడ్ వీల్ చైర్స్ 05 21
ల్యాప్‌టాప్స్ 26 24
ట్యాబ్స్ 14 02
5జీ స్మార్ట్‌ఫోన్స్ 05 05
మొత్తం యూనిట్లు 144 359

మరింత ఆసరా!