
వారసత్వ హోదాకు నాలుగేళ్లు..
80 శాతం పూర్తయిన ప్రశాద్ ప్రాజెక్టు పనులు
వెంకటాపురం(ఎం): రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించడంతో దేశంతోపా టు తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వపడ్డారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం పాలంపేట పరిధిలో 1213లో కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయానికి యునెస్కో హోదా కల్పిస్తున్నట్లు జూలై 25, 2021న వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రకటించడంతో ప్రజలు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. రామప్ప ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సంబురపడ్డారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం ఆలయాన్ని సందర్శించి రూపురేఖలు మారుస్తామని, రామప్ప అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నీటిమూటగానే మిగిలింది. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చి నేటికి( శుక్రవారం) నాలుగేళ్లు పూర్తయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది పరిస్థితి. రామప్పకు గుర్తింపునిచ్చే నేపథ్యంలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ కొన్ని షరతులు విధించింది. ఆలయానికి వచ్చే పర్యాటకులకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఆలయం చుట్టూ 500 మీటర్ల లోపు బఫర్ జోన్ ప్రకటించి ఎలాంటి నిర్మాణాలు, కట్టడాలు చేపట్టొద్దని షరతులు విధించింది. 2022 డిసెంబర్‌లోగా ఆలయ ఆవరణలోని కామేశ్వరాలయాన్ని పునర్నిర్మించాలని, రామప్ప పరిసర ప్రాంతాల్లోని 10 ఉప ఆలయాలకు మరమ్మతు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని షరతుల్లో ప్రధానంగా పేర్కొంది. అయితే నాలుగేళ్లు గడుస్తున్నా కేంద్ర, రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు రామప్ప ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడంపై పర్యాటకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ముందుకు సాగని కామేశ్వరాలయ పనులు..
రామప్ప ఆలయ ఆవరణలోని కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం పేరుతో 2011లో పురావస్తుశాఖ అధికారులు తొలగించారు. తొలగించిన శిల్పాలను రామప్ప గార్డెన్‌లో ఉంచడంతో శిల్పాలు ఎండుతూ, తడుస్తూ కళాసౌందర్యాన్ని కోల్పోతున్నాయి. 2022 డిసెంబర్‌లోగా కామేశ్వరాలయాన్ని పునరుద్ధరించాలని హెరిటేజ్ కమిటీ షరతు విధించినా ఇప్పటివరకు ఆలయ నిర్మాణ పనులు పునాదులకే పరిమితమయ్యాయి. 2026 జూన్‌లోగా పూర్తి చేస్తామని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు గడువు తీసుకుని 2025 మార్చిలో పనులు ప్రారంభించారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో కామేశ్వరాలయ నిర్మాణ ప్రదేశం నీటితో నిండి కుంటను తలపిస్తోంది.
రూ.15 కోట్లు కేటాయించినా అభివృద్ధి ఏది?
రామప్ప ఆలయం ఎదుట ఉన్న గొల్లాలగుడి, శివా లయాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబా టులోకి తీసుకురావాలని హెరిటేజ్ కమిటీ పేర్కొంది. గొల్లాలగుడికి మరమ్మతు చేపట్టి అభివృద్ధి చే సినా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురాలే దు. గతేడాది గుప్తనిధుల కోసం గొల్లాలగుడి పైకప్పును దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం ఎ దుట ఉన్న మరో శివాలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే కూలుతుందనే కారణంతో ఆరునె లల క్రితం ఆలయానికి సపోర్టుగా ఇనుప పైపులు అమర్చి వదిలేశారు. రామప్ప పరిధిలోని 10 ఉప ఆలయాలను కూడా వినియోగంలోకి తీసుకురావా ల్సి ఉంది. కేవలం ఆలయాలపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఉప ఆలయాలకు రూ.15 కో ట్లు కేటాయించినా అభివృద్ధి ముందుకు సాగలేదు.
యునెస్కో గుర్తింపు పొందినా కానరాని అభివృద్ధి
పునాదుల్లోనే కామేశ్వరాలయ పనులు
వినియోగంలోకి రాని ఉప ఆలయాలు
రామప్ప తూర్పు రోడ్డుకు గ్రహణం
నిద్రమత్తులో పురావస్తుశాఖ అధికారులు
రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో దేవాలయానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రశాద్’ ప్రాజెక్టు కింద రూ.61.99 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా రూ.42.14 కోట్లు మంజూరు చేసి సుమారు 10 ఎకరాల్లో ఇంటర్ ప్రిటేషన్ సెంటర్ నిర్మిస్తోంది. ఇందులో పర్యాటకుల సమాచార కేంద్రం, విశ్రాంతి గది, సమావేశపు గది, జ్ఞానకేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రం, సాంస్కృతిక కేంద్రం, చిత్రకళామందిర్ (4డీ మూవీహాల్), టాయిలెట్ బ్లాక్, మెడికల్ రూం, ఫుడ్ కోర్టు, స్టాల్స్, ఫౌంటెన్, చిల్డ్రన్స్ పార్క్ నిర్మించడంతో పాటు విహారం ప్రదేశంగా ఇంటర్ ప్రిటేషన్ సెంటర్‌ను తీర్చిదిద్దుతున్నారు. పనులు 80 శాతం పూర్తయ్యాయని, మూడు నెలల్లో మిగతావి పూర్తి చేసి డిసెంబర్‌లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని టూరిజం అధికారులు తెలిపారు.
తూర్పు రోడ్డుకు కలగని మోక్షం..
రామప్ప ఆలయాన్ని వాస్తుపరంగా దర్శించుకునేందుకు తూర్పుముఖ ద్వారాన్ని (రోడ్డు) 2020లో రూ.90 లక్షల వ్యయంతో నిర్మించారు. రెండు వరుసల రోడ్డును నిర్మించి, సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తయిన మూడు నెలలకే రామప్ప సరస్సు మత్తడి నుంచి వచ్చే వరదనీటికి కొట్టుకుపోయింది. వరద నీరు వెళ్లేందుకు వేసిన పైపులు సైతం ధ్వంసమయ్యాయి. మూడు నెలల క్రితం రోడ్డుకు మరమ్మతులు చేపట్టినా వినియోగంలోకి తీసుకురాకపోవడంతో పర్యాటకులు పడమర రోడ్డు మీదుగా వెళ్లి రామప్ప ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

వారసత్వ హోదాకు నాలుగేళ్లు..

వారసత్వ హోదాకు నాలుగేళ్లు..