
విద్యా కమిషన్‌కు సమస్యల ఏకరువు..
కేయూ క్యాంపస్: రాష్ట్ర విద్యాకమిషన్‌కు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకులు సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. గురువారం రాష్ట్ర విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వర్‌రావు, చారకొండ వెంకటేశ్ బృందం.. కాకతీయ యూనివర్సిటీకి విచ్చేసింది. ఈ సందర్భంగా వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రంతో కలిసి క్యాంపస్‌లోని సెనేట్‌హాల్‌లో విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించింది. ఇందులో యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను వారు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. సావదానంగా విన్న రాష్ట్ర విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి.. కేయూలోని సమస్యలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కాగా, ఈ సమావేశం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.20 గంటల వరకు కొనసాగింది.
బ్లాక్ గ్రాంట్ పెంచాలి..
ఎన్‌జీఓ బాధ్యుల వినతి
కాకతీయ యూనివర్సిటీలోని ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ పెంచాలని ఎన్‌జీఓ బాధ్యులు విద్యా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పాలని కేయూ ఎన్‌జీఓ అధ్యక్షుడు వల్లాల తిరుపతి , నవీన్, సతీశ్, ఇతర బాధ్యులు వినతిపత్రం అందించారు. 2013లో నియమితులైన తమకు పీఆర్‌సీని వర్తింపజేయాలని క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ బాధ్యుడు బొక్క మొగిలి వినతిపత్రం సమర్పించారు. తమను రెగ్యులరైజ్ చేయాలని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వినతిపత్రాలు సమర్పించారు.
ప్రధానంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రస్తావించిన సమస్యలు..
కేయూలో ఎస్‌ఎఫ్‌సీ కోర్సులను రెగ్యులర్‌గా మార్చాలి
క్యాంపస్, యూనివర్సిటీ కాలేజీల్లో సీటు పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి.
కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి. రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలి.
కేయూలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లాంటే సరైన దారి లేదు. విద్యార్థులు మూడు కిలోమీటర్ల వరకు నడవాల్సింటుంది.వాహన సదుపాయం కల్పించాలి. విద్యార్థినులకు అక్కడే కళాశాల సమీపంలో హాస్టల్‌వసతి కల్పించాలి.
కేయూ లా కళాశాలకు మూట్ కోర్టు కూడా లేదు. వెంటనే ఏర్పాటు చేయాలి. లా కాలేజీ ఐదేళ్ల కోర్సు విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి.
కేయూలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీకి ఫిజికల్ డైరెక్టర్‌ను నియమించాలి. ప్రతీ యూనివర్సిటీ కాలేజీ కూడా పీడీని నియమించాలి.
కేయూ భూములను రక్షించాలి. యూనివర్సిటీ చుట్టూ ప్రహరీని నిర్మించాలి.
కేయూ అభివృద్ధికి నిధులు పెంచాలి
విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకుల గోడు
కేయూ సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తాం
రాష్ట్ర విద్యాకమిషన్ చైర్మన్
ఆకునూరి మురళి

విద్యా కమిషన్‌కు సమస్యల ఏకరువు..