
అత్త మందలించిందని కోడలు ఆత్మహత్యాయత్నం..
● చికిత్స పొందుతూ మృతి
● ఈదులపూసపల్లిలో ఘటన
మహబూబాబాద్ రూరల్ : అత్త మందలించిందనే కారణంతో మనస్తాపానికి గురైన కోడలు ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా రూరల్ ఎస్సై వి. దీపిక బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన ఆకుల మాధవి (40) యుగంధర్ దంపతులకు 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈనెల 20వ తేదీన ఆ కుటుంబీకులు వరి నాటు వేసేందుకు వెళ్లారు. అక్కడ అత్త ధనమ్మ నాటు మంచిగా వేయించమని కోడలు మాధవిని మందలించి ఇంటికెళ్లింది. పని పూర్తయిన అనంతరం సాయంత్రం ఇంటికెళ్లిన మాధవి.. అత్త మందలించిందనే మనస్తాపంతో అదేరోజు రాత్రి గడ్డి మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన భర్త, అత్త వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలు మాధవి తల్లి ముత్యాల ప్రమీల ఫిర్యాదు మేరకు రూరల్ ఏఎస్సై వెంకన్న, కానిస్టేబుల్ సంతోశ్.. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు రమ్యశ్రీ, నవ్యశ్రీ, ఉదయశ్రీ ఉన్నారు.