
26 వరకు ‘బొగత’ సందర్శన నిలిపివేత
వాజేడు: అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ వరకు బొగత జలపాతం సందర్శన నిలిపివేసినట్లు ములుగు డీఎఫ్‌ఓ కిషన్ జాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ముత్యంధార, కొంగర, మామిడి లొద్ది, కృష్ణపురం జలపాతాలను పర్యాటకుల భద్రతాకారణాల దృష్ట్యా శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో సందర్శకులు ఇటు వైపు వెళ్లొదని సూచించారు. అటవీ అధికారులు హెచ్చరికలు బేఖాతర్ చేసిన వారిపై పోలీసు కేసు నమోదు చేస్తామని తెలిపారు.
సిబ్బంది పహారా.. గేటుకు తాళం
బొగత జలపాతం సందర్శనను నిలిపి వేసిన అధికారులు జాతీయ రహదారి నుంచి జలపాతానికి వెళ్లే దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బంది కాపలా ఉన్నారు. అదే సమయంలో జలపాతం ప్రధాన ద్వారానికి తాళం వేశారు. కాగా, కొందరు పర్యాటకులు గుమ్మడి దొడ్డి వైపు నుంచి జలపాతం వద్దకు వచ్చి నీటిలో దిగుతున్నారు. వరద ఉధృతంగా ఉందని బొగతకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం దొంగ దారిలో జలపాతానికి వెళ్తున్నారు.