
నిబంధనలకు ‘నీళ్లు’!
తొర్రూరు: జిల్లాలోని పలు మండలాల ప్రజలు తాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు. రక్షిత మంచినీటి పథకాల ద్వారా అరకొరగా నీరు సరఫరా అవుతుండడంతో అంతా డబ్బా నీళ్లు కొనుగోలు చేసి తాగడానికి అలవాటు పడ్డారు. దీన్ని మినరల్ వాటర్ ప్లాంట్ కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. భూగర్భ జలాలను యథేచ్ఛగా తోడేస్తూ, కనీస నిబంధనలు పాటించకుండా నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలో అనధికారికంగా సుమారు 250 వరకు నీటి శుద్ధి కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో అధిక శాతం లాభార్జనే ధ్యేయంగా నిర్వహిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించడంలేదు.
సమన్వయ లోపం..
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం నీటి శుద్ధి కేంద్రాల నిర్వాహకులకు వరంగా మారింది. ఆహార పరిరక్షణ విభాగం, భూగర్భజల వనరుల శాఖ, రెవెన్యూ శాఖలు మినరల్ వాటర్ ప్లాంట్‌లను పర్యవేక్షించాలి. కానీ ఏ ఒక్కశాఖ కనీసం దృష్టి సారించడం లేదు. తాగునీటి స్వచ్ఛత, ఇతర అంశాలపై జాగ్రత్తలు తీసుకోకుండా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాటిపై ప్రజలు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.
నీటి శుద్ధి కేంద్రాల్లో పాటించాల్సిన
నిబంధనలివే..
● నీటి శుద్ధి ప్రక్రియలో భారత ప్రమాణాల సంస్థ(బీఐఎస్) నిర్ణయించిన ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి.
● కొత్తగా కేంద్రాలు ఏర్పాటు చేసుకునేవారు ప్రత్యేక గదులు కేటాయించాలి. వాటికి అనుబంధంగా నీటిని పరీక్షించేందుకు ప్రయోగశాల ఉండాలి. పరికరాలను సైతం నిబంధనల ప్రకారమే ఉపయోగించాలి.
● నీటిని నింపి శుద్ధి చేయడానికి 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ డ్రమ్ములు వినియోగించాలి. వాటిని తప్పకుండా ఓజోనైజేషన్ చేయాలి.
● మైక్రో బయాలజిస్టు, కెమిస్టుల పర్యవేక్షణ ఉండాలి. నీటి లవణాలు ఏ స్థాయిలో కరిగాయో పరీక్షించాలి.
● నీటిని నింపే డబ్బాలను క్రమం తప్పకుండా శుద్ధి చేయాలి. నీటిని నింపినప్పుడు పూర్తి వివరాలతో కూడిన స్టిక్కర్ అతికించాలి.
● పంచాయతీ అధికారుల నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. బీఐఎస్ సంస్థకు నీటి నమూనా ప్రతీనెల పంపాలి. ఈ నిబంధనలను ఏ ఒక్క వాటర్ ప్లాంట్ నిర్వాహకుడు పాటించడం లేదు.
ప్రమాణాలు పాటించకపోతే చర్యలు
ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం శుద్ధి నీటి కేంద్రాల నిర్వాహకులు విధిగా లైసెన్స్‌లు పొందాలి. తప్పనిసరిగా ప్యాకింగ్ చేసిన నీటినే విక్రయించాలి. నిబంధనలు పాటించని వ్యాపారులకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 5లక్షల జరిమానా విధించే అవకాశముంది. నాణ్యతా ప్రమాణాలు పాటించని నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, తహసీల్దార్, తొర్రూరు
ఇష్టారాజ్యంగా తాగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ
చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న
అధికారులు

నిబంధనలకు ‘నీళ్లు’!