నయీంనగర్: తమ జీవనవిధానానికి భంగం కలిగినప్పు డు ప్రజలు హక్కుల కోసం పోరాడాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఆదివారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో పౌరహక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా 3వ మహాసభ పి.రమేశ్ చందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో లక్ష్మణ్ మాట్లాడుతూ ఆదివాసీల సహజ జీవనవిధానాన్ని బలవంతంగా మార్చుకోవాలని వారిపై దాడులు, అక్రమ అరెస్ట్‌లు చేయడం వారికి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాయడమేనన్నారు.
ప్రజా ఉద్యమాలపై జరుగుతున్న అణిచివేతను ప్రశ్నించడమే పౌర హక్కుల సంఘం ప్రధాన లక్ష్మం, కర్తవ్యమన్నారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపి శాంతి చర్చలు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎస్.పాణి, హైకోర్టు అడ్వకేట్ వి.రఘునాథ్, గుంటి రవి, టీపీఎఫ్ నాయకురాలు బి.రమాదేవి , తదితరులు పాల్గొన్నారు.
తాటిచెట్టుపైనుంచి పడి గీత కార్మికుడి మృతి
నెల్లికుదురు: తాటిచెట్టుపైనుంచి పడి ఓ గీత కార్మి కుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీకటి ప్రభాకర్ గౌడ్ (48) రోజుమాదిరిగానే తాటిచెట్టు ఎక్కి కల్లు గీసిన అనంతరం కిందికి దిగుతున్నాడు. ఈ క్రమంలో జారి కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూసి సమాచారం అందించగా కుటుంబ సభ్యులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని చూడగా అప్పటికే మృతి చెందాడు. ప్రభాకర్‌గౌడ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు.
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
కురవి: కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కురవి మండలం గుండ్రాతిమడుగులో చోటు చేసుకుంది. పీఎస్సై కృష్ణారెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన గుంజె లక్ష్మ ణ్(34)కు కురవి మండలం గుండ్రాతిమడుగు(విలేజి) గ్రామానికి చెందిన కల్పనతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. లక్ష్మణ్ నెల రోజుల క్రితం గుండ్రాతిమడుగు(విలేజీ)కు వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబకలహాలు, ఆర్థిక సమస్యలతో శనివారం రాత్రి పురుగుల మందు తాగి రైల్వే ట్రాక్ పక్కన ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పడుకుని ఉన్నాడు. ఆదివారం ఉదయం కొనుగోలు కేంద్రానికి వచ్చిన కొందరు రైతులు లక్ష్మణ్ పడుకుని ఉన్న విషయాన్ని కుటుంబీకులకు తెలిపారు. వారు ఘటనాస్థలికి చేరుకుని చూడగా అప్పటికే మృతి చెంది కనిపించడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. మృతుడి తమ్ముడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని లక్ష్మణ్ కుటుంబీకులు కరీంనగర్ తరలించారు.
అమ్మమ్మతాతయ్య మందలించారని గొల్లపల్లిలో మరో యువకుడు..
నెక్కొండ: అమ్మమ్మతాతయ్య అకారణంగా మందలించారనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని గొల్లపల్లిలో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బట్టు అజయ్ (21) తల్లి చిన్నతనంలో మృతి చెందింది. దీంతో అజయ్‌ని అమ్మమ్మతాతయ్య పెంచిపెద్ద చేశారు. అజయ్ తాపీ మేసీ్త్ర పని చేస్తుండగా ఈ నెల 10న సాయంత్రం ఇంటి వచ్చాడు. ఎక్కడకి వెళ్లావని, కాళ్లు కడుక్కుని ఇంట్లోకి రావాలని మందలించారు. దీంతో తనను చిన్న విషయాలకే అకారణంగా మందలిస్తున్నారని, స్వేచ్ఛ లేదని అజయ్ మనస్తాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ప్రజలు హక్కుల కోసం పోరాడాలి


