'క్రెడిట్‌ కార్డు' కోసం.. ఫోన్‌కు మెసేజ్‌ వచ్చిందా.. జర జాగ్రత్త! లేదంటే..

- - Sakshi

క్రెడిట్‌ కార్డు బ్లాక్‌ అయిపోతుందని ఫోన్‌కు మెసేజ్‌..

స్పందించి వివరాలు నమోదు చేసిన బాధితుడు!

నిమిషాల వ్యవధిలో రూ.64 వేలు మాయం..

సాక్షి, మహబూబాబాద్‌: క్రెడిట్‌ కార్డు బ్లాక్‌ అయిపోతోంది.. వెంటనే అప్‌ డేట్‌ చేసుకోవాలని ఓ వ్యక్తి ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీనిని చూసి ఆందోళనకు గురైన బాధితుడు వెంటనే తనకొచ్చిన మెసేజ్‌లో ఉన్న లింక్‌ ఓపెన్‌ చేసి అప్‌డేట్‌ చేశాడు. అనంతరం ఫోన్‌కు ఓటీపీ రాగా టైప్‌ చేశాడు. అప్‌డేట్‌ అయిన తర్వాత నిమిషాల వ్యవధిలో రూ.64 వేలు ఖాతా నుంచి మాయమయ్యాయి.

దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన మానుకోట పట్టణంలో జరిగింది. జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు కేజీఆర్‌ కాలనీకి చెందిన చీదరి సతీష్‌ కుమార్‌ ఫోన్‌కు ఈ నెల 3వ తేదీన క్రెడిట్‌ కార్డు బ్లాక్‌ అయిపోతుంది.. వెంటనే అప్‌ డేట్‌ చేసుకోవాలని ఓ గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్‌ పంపించాడు.

ఇందుకు స్పందించిన సతీష్‌కుమార్‌ వెంటనే ఆ మెసేజ్‌లో ఉన్న లింక్‌ ఓపెన్‌ చేసి యూనియన్‌ బ్యాంక్‌ ప్రొఫార్మా రాగానే అప్‌ డేట్‌ చేశాడు. ఆ వెంటనే అతడి ఫోన్‌కు ఒటీపీ వచ్చింది. దానిని టైప్‌ చేసిన తర్వాత అప్‌ డేట్‌ అయింది. నిమిషాల వ్యవధిలో బాధితుడి ఖాతా నుంచి రూ.64 వేలు డెబిట్‌ అయినట్లు సమాచారం వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ వై.సతీష్‌ ఆదివారం తెలిపారు.
ఇవి చదవండి: కారులో బయలుదేరిన కొన్ని నిమిషాలకే.. విషాదం!

Read latest Mahabubabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top