నేడు పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పీజీఆర్‌ఎస్‌

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలు ఉన్న ప్రజలు అర్జీలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త!

మంత్రాలయం రూరల్‌: శ్రీరాఘవేంద్రస్వామి మఠానికి వచ్చే భక్తులు నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీమఠం మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీనిధి సూచించారు. ఆదివారం మంత్రాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నకిలీ వెబ్‌సైట్‌లతో భక్తులు వసతి గృహాల విషయంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. శ్రీమఠంకు సంబంధించిన అన్ని అంశాలు https://srsmatha.org అనే వెబ్‌సైట్‌లో మాత్రమే ఉంటాయన్నారు. ఇందులో వసతి గృహాలు, సేవ, నిత్య సేవలు, తత్కాల్‌ రూం బుకింగ్‌ అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీమఠం కాంటాక్ట్‌ నంబర్లు అందులో పొందుపరచామని తెలిపారు.

నేడు డయల్‌ యువర్‌ సీఎండీ, ఎస్‌ఈ

కర్నూలు(అగ్రికల్చర్‌): డయల్‌ యువర్‌ ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ ఆర్‌.ప్రదీప్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్‌ భవన్‌లో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్‌చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

శ్రీమఠానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రానికి భక్తులు పోటెత్తారు. శుక్ర, ఆదివారాలు సెలవులు కావడంతో కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. భక్తుల రాకతో శ్రీమఠం మధ్వ కారిడార్‌ సందడిగా కనిపించింది. కత్పతరు క్యూ కాంపెక్స్‌ల్లో రద్దీ కొనసాగింది. శ్రీ రాఘవేంద్రుడి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు, మంచాలమ్మ, రాఘవేంద్రుల దర్శన క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తులు మంచాలమ్మ, రాఘవేంద్రుల బృందావనం దర్శనం చేసుకుని ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల వెండి, స్వర్ణ,నవరత్న రథోత్సవాల్లో పాల్గొన్నారు.

విద్యుత్‌ శాఖలో పైరవీలకు పోస్టింగ్‌!

కర్నూలు(అగ్రికల్చర్‌): విద్యుత్‌ శాఖలో ఇటీవల టెస్ట్‌ గ్రేడ్‌–2లో నలుగురికి, టెస్ట్‌ గ్రేడ్‌–1లో నలుగురికి పోస్టింగ్‌లు ఇచ్చారు. రెండు కేడర్లలో పైరవీలు చేసిన వారికి ఒకచోట పోస్టింగ్‌ ఇస్తూ మరో చోట పనిచేసే అవకాశం కల్పించారు. నంద్యాల జిల్లాలో టెస్ట్‌ గ్రేడ్‌–2గా పనిచేస్తూ బైఫర్‌కేషన్‌లో భాగంగా కర్నూలుకు వచ్చిన గిరిజన ఉద్యోగికి సుదూర ప్రాంతమైన ఆదోనిలో పోస్టింగ్‌ ఇచ్చారు. టెస్ట్‌ గ్రేడ్‌–2లో నలుగురుకి పోస్టింగ్‌ ఇస్తే ముగ్గురికి వారు కోరుకున్న స్థానాలు కేటాయించారు. ఒక్కరిని మాత్రమే ఆదోనికి పంపడం వివాదాస్పదమైంది. ఈ పోస్టింగ్‌లో హెచ్‌టీ డీఈఈ ఒక్కరు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ముగ్గురికి వారికి అనుకూలంగా పోస్టింగ్‌ ఇచ్చి, తనకు మాత్రమే అన్యాయం జరిగిందనిఎస్‌ఈని కలసే అవకాశం కూడా ఇవ్వడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాను మొదటి నుంచి దూరప్రాంతాల్లోనే పనిచేశానని, నంద్యాల నుంచి కర్నూలుకు వస్తే మళ్లీ ఆదోనికి వేశారని తెలిపారు.

పోతిరెడ్డిపాడు నుంచి తగ్గిన నీటి విడుదల

జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నీటి విడుదల రోజురోజుకు తగ్గిపోతోంది. ఆదివారం సాయంత్రం శ్రీశైలం డ్యాంలో 849.90 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు వద్ద 848.90 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ 2, 4, 5, 7 గేట్లు తెరచి ఉంచినప్పటికీ కేవలం 1,500 క్యూసెక్కుల నీరు మాత్రమే ఎస్సారెమ్సీ కాల్వలోకి వెళ్తున్నాయి. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి జీఎన్‌ఎస్‌ఎస్‌ కాల్వకు సరఫరా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement