● నేటి నుంచి 8వ తేదీ వరకు నిర్వహణ
● హాజరుకానున్న
3,37,038 మంది విద్యార్థులు
కర్నూలు సిటీ: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకునేందుకు ఏటా నాలుగు ఫార్మాటివ్, రెండు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి ఎఫ్‌ఏ–2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎస్‌సీఈఆర్‌టీ రూపొందిన ప్రశ్నపత్రాలతో ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నంవేళల్లో నిర్వహించనున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి, 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి 10.45 గంటల వరకు, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 గంటల వరకు 1నుంచి 8 తరగతులకు, 9, 10 తరగతులకు మధ్యాహ్నం 2.45 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల వారీగా సమయాలను కేటాయించారు.
‘ప్రైవేట్’లో సొంత ప్రశ్నపత్రాలు!
జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లకు చెందిన 2,68,830 విద్యార్థులు ఎఫ్‌ఏ–2 పరీక్షలు రాయనున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో సొంతంగా తయారు చేసుకున్న ప్రశ్నపత్నాలతో పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ రూపొందిన ప్రశ్నపత్రాలను తీసుకోవడం లేదు. కేవలం కొన్ని స్కూళ్లకు చెందిన వారు మాత్రమే 6 నుంచి 10వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు 68,208 మంది మాత్రమే సోమవారం నుంచి మొదలైయ్యే పరీక్షలు రాయనున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు చెందిన విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఆయా స్కూల్ క్లస్టర్ స్కూల్‌లో ఆ స్కూల్ హెచ్‌ఎం పర్యవేక్షణ, మండల విద్యావనరుల కేంద్రాల్లో ఉంచుతారు. ఆరు నుంచి పదో తరగతి ప్రశ్నపత్రాలను ఆయా మండల విద్యావనరుల కేంద్రం మండల విద్యాధికారి పర్యవేక్షణలో భద్రపరిచారు. పరీక్ష సమయానికి గంట ముందుగా ఆ ప్రశ్న పత్రాలను తీసుకపోవాల్సి ఉంటుంది. నిబంధలన ఉల్లంఘన ఏదైనా జరిగితే సంబంధిత అధికారులదే బాధ్యత అని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 8వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఎఫ్‌ఏ–2 పరీక్షల ముల్యాంకనం 9 తేదీలోపు పూర్తి చేసి ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేయాలి. 10వ తేది రెండో శనివారం, 11 ఆదివారం, 12వ తేదీ నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.


