న్యాయం చేయండి మేడం
డీఎస్సీ అక్రమాలపై విచారణ చేయాల్సిందే
కర్నూలు(టౌన్): మెగా డీఎస్సీ పేరుతో సాగించిన మెగా దగాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం శ్రేణులు ప్రభుత్వంపై సమరభేరి మోగించారు. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలంటూ ఆ పార్టీ శ్రేణులు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక విజయ మిల్క్ డైరీ నుంచి చంద్రబాబు డౌన్‌డౌన్, డేటా ఎందుకు డీలీట్ చేశారు.. మెరిట్ లిస్టు ఎందుకు దాచారు.. చినబాబు రాజీనామా చేయి.. చంద్రబాబు.. మీ సుపుత్రుడు శాఖలో డార్క్ అవినీతిని ఎందుకు దాచిపెడుతున్నారు. అన్న బ్యానర్లు ప్రదరిస్తూ, నినదాలు చేస్తూ విద్యార్థులతో కలిసి చలో కలెక్టరేట్ ర్యాలీ చేపట్టారు. అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి లక్షాలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుకు సంబంధించిన డీఎస్సీ నియామకాల ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మెరిట్ జాబితాలో పారదర్శకత లేకపోవడం, ఎంపిక ప్రక్రియపై సందేహాలు, అపోహలు నెలకొన్నాయన్నారు. యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. వీటన్నింటిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహణలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
● వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతూల్, జిల్లా అధ్యక్షులు ఎద్దుల శివారెడ్డి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఉపాధ్యాయుల నియామకాల్లో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగ ఉపాధ్యాయులను దగా చేశారని విమర్శించారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెరిట్ జాబితా ఎందుకు ప్రదర్శించలేదని.. మేసేజ్‌లు పంపి ఆ తరువాత డీలీట్ చేసి అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించారన్నారు. కాల్ లెటర్ పంపి ఆ తరువాత ఎంపిక కాలేదని చెప్పడంతో వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు మనోవేధనకు లోనయ్యారన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను రూ.15 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మణీ రెడ్డి, యువజన విభాగం కార్యదర్శి మధు, డి.నజీర్ అహమ్మద్(ఎమ్మిగనూరు) ఎం.కే. వెంకటేష్(కోడుమూరు) దుర్గ(పాణ్యం), అశోక్ కుమార్ రెడ్డి (పత్తికొడ), పాణ్యం పబ్లిసిటీ విభాగం అధ్యక్షులు సాయి, బనవాసి బసి రెడ్డి (ఎమ్మిగనూరు మండల యువజన విభాగం అధ్యక్షులు) తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించా. నాకు 75 మార్కులు వచ్చాయి. ఉద్యోగం వస్తుందని ఆశించా. కాల్ లెటర్ వచ్చింది. అయితే ఏమి జరిగిందో ఏమో నాకు ఉద్యోగం రాలేదు. మీరే ఎలాగైనా న్యాయం చేయాలి మేడం.
– జిల్లా కలెక్టర్‌కు షేక్ హసీనా బేగం వినతి
బాధితులకు న్యాయం జరిగే వరకు
పోరాటం
రూ.15 లక్షలకు స్పోర్ట్స్ కోటా
పోస్టులను అమ్ముకున్న కూటమి నేతలు
అవకతవకలకు బాధ్యత వహిస్తూ
మంత్రి నారా లోకేష్
రాజీనామా చేయాలి
కర్నూలులో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట
ధర్నా, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత


