మంత్రాలయం: శుభకార్యానికి వచ్చి ఆనందంగా ఉన్న వారి ఇళ్లల్లో తుంగభద్ర నదీ స్నానం తీవ్ర విషాదాన్ని నింపింది. సత్యనారాయణ పూజకు వచ్చి ఐదుగురు గల్లంతయ్యారు. పిల్లవాడిని రక్షించబోయి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. మంత్రాలయానికి చెందిన కాళప్ప ఆచారి కుమారుడు శశికుమార్ వివాహం ఈ నెల 7న జరిగింది. వివాహం ముగియడంతో పూర్ణిమ సందర్భంగా కాళప్ప ఆచారి ఇంట్లో సత్యనారాయణ పూజ చేస్తున్నారు. పూజ నిమిత్తం పలు ఊళ్ల నుంచి బంధువులు మంత్రాలయం వచ్చారు. శనివారం మధ్యాహ్నం కాళప్ప ఇంట్లో భోజనాలు ముగించుకుని ఆరుగురు బంధువులు పుణ్యస్నానాలకు తుంగభద్ర నదికి వెళ్లారు. మంత్రాలయంలో శ్మశానవాటిక దగ్గరలోని ఉన్న పుష్కర ఘాట్ సమీపానికి చేరుకున్నారు. స్నానాలకు దిగుతుండగా కర్నూలులోని ఆదిత్య నగర్ వాసి సతీష్ చంద్ర కుమారుడు యువన్ చంద్ర (5) తీరంలో చెంబుతో ఆడుతూ కనిపించారు. అయితే బాలుడి చెంబు గాలికి నీటిలోకి కొట్టుకుపోయింది. దీంతో చెంబు కోసం ఆబాలుడి నదిలోకి దిగాడు. పిల్లోడు అనుకోకుండా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుండటంతో అక్కడే ఉన్న బంధువులు వెంటనే స్పందించారు. పిల్లోడిని రక్షించడానికి ఆరుగురు నదిలో దూకారు. వీరిలో ఐదుగురు నదీ ప్రవాహంలో గల్లంతయ్యారు. అపర్ణ అనే యువతి మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోతూ దూరాన బండ రాయిని చేరుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
గల్లంతైన వారిలో తండ్రి, కొడుకు
కర్నూలులోని ఆదిత్యనగర్‌కు చెందిన సతీష్ చంద్ర (36) పూజారిగా పనిచేస్తున్నారు. తన ఆశలన్నీ కుమారుడు యువన్ చంద్ర (5)పైనే ఉంచుకున్నారు. అనుకోకుండా కుమారుడు తుంగభద్ర నదిలో అదృశ్యం కావడంతో తండ్రి తల్లడిల్లారు. వెంటనే నదిలో దూకి కుమారుడిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే నదిలో గుండాలు ఉండటంతో కుమారుడితోపాటు తండ్రి కూడా గల్లంతయ్యారు.
పెళ్లి కుమార్తె చెల్లెలు..
అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన రత్నమయ్య ఆచారి కుమార్తె సంధ్య(21) భవిష్యత్‌పైనే ఎన్నో ఆశలు ఉంచుకున్నారు. శశికుమార్ వివాహం చేసుకున్న యువతికి ఈమె స్వయానా చెల్లెలు. తన అక్క వివాహంలో ఎంతో సందడి చేసిన ఈ యువతి సత్యనారాయణ పూజలో పాల్గొన్నారు. భక్తి గీతాలు కూడా ఆలపించారు. పుణ్యస్నానాలు చేసేందుకు తుంగభద్ర నదికి వచ్చి బాలుడిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు.
గజ ఈతగాళ్లతో గాలింపు..
తుంగభద్ర నదిలో బాలుడు అదృశ్యమయ్యాడని, మరో ఆరుగురు కనిపించడం లేదని తెలిసిన వెంటనే పోలీసులు స్పందించారు. సంఘటన స్థలానికి ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి చేరుకుని గజ ఈతగాళ్లను రప్పించారు. పుట్టీలతోనూ నదిలో విస్తృతంగా గాలింపులు చేపట్టారు. ధనుష్ మృతదేహం బయటపడటంతో బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు. దీంతో తుంగభద్ర తీరం శోక సంద్రాన్ని తలపించింది. గల్లంతైన వారి కోసం తుంగభద్ర నదిలో గజఈతగాళ్లు అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపుల్లో కర్ణాటక హసన్ జిల్లా బెలూరు నియోజకవర్గం దోడ్డ చెల్లూరు గ్రామానికి చెందిన రామలక్ష్మణగౌడు (65) మృతదేహం లభ్యమైంది. మృతదేహంలోని చొక్కాలో ఉన్న ఆధారాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందవేశారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆదివారం కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నారు.
ధనుష్ మృత దేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
బాలుడి తప్పటడుగులు ఇక కనిపించవు.. వచ్చీరాని మాటలు అదృశ్యమయ్యాయి. దివ్య సౌధాలు నిర్మించే వారి మాటలు ఇక వినిపించవు...బంగారు భవిష్యత్తుపై యువతి, యువకుల స్వప్నాలు గల్లంతయ్యాయి. కుమారుడే ఇంటి దీపం అని తండ్రి తన ధైర్యాన్ని చూపలేరు.. అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాదంతో భక్తి కీర్తనలతో అలారుతూ ఉండే మంత్రాలయంలోని తుంగభద్ర నదీ తీరం శనివారం శోకాన్ని ఆలపించింది. బాలుడితోపాటు రక్షించడానికి వెళ్లిన నలుగురు గల్లంతు కావడంతో బంధువులకు దుఃఖమే మిగిలింది.
ఆదోనికి చెందిన శంకరప్ప ఆచారి కుమారుడు అపర్ణ (13) మృత్యువును జయించారు. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుండగా బండ రాయిని ఈ బాలికను కాపాడింది. దానిని పట్టుకుని ప్రాణాలతో నదీ తీరం చేరుకున్నారు. తనతోపాటు నదిలో దూకినవారు మృత్యువాత పడటంతో శోకసంద్రంలో మునిగారు.


