దగా డీఎస్సీపై రేపు ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై రేపు ర్యాలీ

May 31 2026 2:12 AM | Updated on May 31 2026 2:12 AM

కర్నూలు (టౌన్‌): ఉపాధ్యాయ నియామక ప్రక్రియ(డీఎస్సీ)లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో, సీబీఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో సోమవారం (జూన్‌1న) భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి తెలిపారు. కర్నూలులోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులోని విజయ డెయిరీ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువకులు, నిరుద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

దేవదాయ శాఖ ఈవోలకు అదనపు బాధ్యతలు

కర్నూలు కల్చరల్‌: దేవదాయ శాఖలో ఈనెల 31వ తేదీన పలువురు ఈవోలు పదవీ విరమణ పొందనున్నారు. వారి స్థానంలో ఇతర గ్రూప్‌ ఆలయాల ఈవోలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ కమిషనర్‌ కె. రామచంద్ర మోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గడివేముల గ్రూప్‌ టెంపుల్స్‌, నందికొట్కూరు గ్రప్‌ –4 టెంపుల్స్‌ ఈవోగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందనున్న టి. హనుమంతరావు స్థానంలో నంద్యాల గ్రూప్‌ –1 టెంపుల్స్‌ ఈవో యు. స్వర్ణముఖికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆదోని గ్రూప్‌–2 టెంపుల్స్‌, ఎమ్మిగనూరు గ్రూప్‌ టెంపుల్స్‌ ఈవోగా విధులు నిర్వహ స్తూ పదవీ విరమణ పొందనున్న పి.సి.రామ్‌ ప్రసాద్‌ స్థానంలో ఎం. ఈశ్వర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

సంజామలలో

41.4 డిగ్రీల ఉష్ణోగ్రత

కర్నూలు(అగ్రికల్చర్‌): అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నా.. ఉష్ణోగ్రతలు అదుపులోకి రావడం లేదు. సంజామలలో శనివారం 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బనగానపల్లెలో 40.2, కల్లూరులో 40, పలు మండలాల్లో 39 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. నాలుగు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఎమ్మిగనూరులో 6.8, పెద్దకడుబూరులో 4.4, మంత్రాలయంలో 3.8, కౌతాళంలో 08 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి.

గ్యాస్‌ సిలిండర్‌ పేలి గుడిసె దగ్ధం

గోనెగండ్ల: గ్యాస్‌ సిలిండర్‌ పేలి గుడిసె దగ్ధం అయ్యింది. ఈ దుర్ఘటన శనివారం ఉదయం వేముగోడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుందరమ్మ తన గుడిసెలో గ్యాస్‌ సిలిండర్‌పై వంటలు చేస్తుండగా విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో భారీగా మంటలు వచ్చాయి. ఆమె కేకలు వేస్తూ బయటకు రాగా గ్యాస్‌ సిలిండర్‌ పెద్దశబ్దంతో పేలి మంటలు చెలరేగి గుడిసె దగ్ధమైంది. నిత్యావసర సరుకులు, బంగారు, వెండి తదితర వస్తువులు కాలి బూడిదై రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు బోయ దస్తగరి తెలిపారు. కాలి బుడిదైన గుడిసెను రెవెన్యూ అధికారులు పరిశీలించారు.

జూన్‌ 10వ తేదీలోగా బ్యాంకు ఖాతాలు తెరవాలి

కర్నూలు (అర్బన్‌): 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు జూన్‌ 10వ తేదీలోగా బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు తమ సమీపంలోని యూనియన్‌ బ్యాంకు లేదంటే పోస్టాఫీసులలో విద్యార్థి పేరు మీద నూతన అకౌంట్‌ను ఓపెన్‌ చేయాలన్నారు. ఓపెన్‌ చేసిన ఖాతాను ఎన్‌పీసీఐ లింక్‌ చేసుకుంటేనే తల్లికి వందనం పథకం ప్రయోజనాలు వర్తిస్తాయన్నారు. ఈ ప్రక్రియను జూన్‌ 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సమీపంలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారా విద్యార్థులు ఆధార్‌ కార్డుతో పాటు ఆధార్‌ లింక్‌ అయిన ఫోన్‌నెంబర్‌ను కూడా తీసుకెళ్లాలన్నారు. ఆయా సచివాలయాల్లోని గ్రామ సంక్షేమ, విద్య సహాయకులు, వార్డు సంక్షేమ విద్య కార్యదర్శిని సంప్రదించాలని ఆమె తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement