డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో కోర్టు కానిస్టేబుళ్ల చేతివాటం
నిఘా వర్గాల ద్వారా తెలుసుకుని పోలీస్ బాస్ కన్నెర్ర
కర్నూలు నాలుగో పట్టణ హెడ్ కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు
రూ.5 లక్షల డబ్బులు, చలానా బుక్కు అప్పజెప్పిన వైనం
కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడపటం వల్లే జిల్లాలో అధిక శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రోజుకో మార్గంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా 100కు 30 శాతం రీడింగ్ వస్తే మద్యం తాగినట్లు గుర్తించి వెంటనే వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి మరుసటి రోజు వారిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో స్టేషన్ రైటర్లు, కోర్టు కానిస్టేబుళ్లు కుమ్మక్కయ్యారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. కోర్టులో అపరాధ రుసుం రూపంలో కేవలం రూ.5 వేలు చెల్లించి రూ.5 వేలు స్వాహా చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దృష్టికి వెళ్లింది. ఈ విషయంపై అంతర్గత విచారణ జరిపించి వాస్తవమని తేలడంతో నాలుగో పట్టణ హెడ్ కానిస్టేబుల్ రవికుమార్‌పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు ఇచ్చారు. మందుబాబుల నుంచి రూ.10 వేలు వసూలు చేసి కోర్టు కానిస్టేబుళ్లు రూ.5 వేలు స్వాహా చేస్తున్నట్లు ఎస్పీ దృష్టికి వెళ్లడంతో శుక్రవారం హెడ్ కానిస్టేబుల్ రవికుమార్‌ను స్వయంగా పిలిపించి విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన వద్ద ఉన్న రూ.5 లక్షల వసూలు డబ్బుతో పాటు చలానా బుక్కును అప్పజెప్పి ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా..
మద్యం తాగి పట్టుబడిన వారిని నిబంధనల ప్రకారం మరుసటి రోజు కోర్టులో హాజరుపరచాలి. అలా కాకుండా వారం రోజుల వరకు కేసులను పెండింగ్‌లో ఉంచుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు నగదు, ఆధార్ కార్డు తీసుకుని వారు కోర్టుకు రాకుండానే కానిస్టేబుళ్లే వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం మద్యం తాగిన వ్యక్తిని కూడా కోర్టులో హాజరుపరచాలి. జేఎఫ్‌సీఎం కోర్టులో డ్రంకెన్ డ్రైవ్ కేసులకు రూ.10 వేలు జరిమానా విధించేవారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రతి నాలుగు మాసాలకోసారి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని లోక్ అదాలత్ జరిగే నెలలో కొన్ని కేసులను హోల్డ్‌లో ఉంచి ఒకేసారి లోక్‌అదాలత్‌లో హాజరుపరచి రూ.3 వేలు అపరాధ రుసుం చెల్లించి మద్యం బాబుల నుంచి మాత్రం రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు ఎస్పీ దృష్టికి వెళ్లింది. అలాగే డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని ఓపెన్ డ్రింకింగ్‌లో పట్టుబడినట్లు చూపించి రూ.10 వేలు వసూలు చేసుకుని కోర్టులో రూ.వెయ్యి మాత్రమే జరిమానా చెల్లించి మిగతా డబ్బులు నొక్కేస్తున్నట్లు ఎస్పీ దృష్టికి వెళ్లింది. అలాగే ఏప్రిల్ 20వ తేదీ నుంచి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో కూడా డ్రంకెన్ డ్రైవ్ కేసులు విచారణ చేపట్టి రూ.3 వేలు అపరాధ రుసుం విధిస్తున్నారు. కోర్టు కానిస్టేబుళ్లు మాత్రం మందుబాబుల నుంచి రూ.10 వేలు వసూలు చేసి అందులో సగం నొక్కేస్తున్నట్లు ఎస్పీకి ఫిర్యాదు అందింది.
ఇంకా దండుకున్న వారెందరో?
పోలీసు శాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. చట్టాలకు లోబడి పనిచేయాల్సిన సిబ్బంది కాసులకు రుచిమరిగి డ్రంకెన్ డ్రైవ్ కేసుల నుంచి వసూలు చేసిన డబ్బుల్లో నొక్కుడు వ్యవహారం బయటపడటంతో ఎస్పీ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వ్యవహారం జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో జిల్లా పోలీసు శాఖలో కోర్టు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వారందరిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ట్రాఫిక్ విభాగంలో కూడా డ్రంకెన్ డ్రైవ్ కేసులో రూ.లక్షల్లో స్కామ్ జరిగినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతమంది కోర్టు కానిస్టేబుళ్లు ఏళ్లుగా పాతుకుపోయి చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు శాఖకు అప్రతిష్ట తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ నిర్ణయించి జిల్లా అంతటా విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
డ్రంకెన్ డ్రైవ్ కేసులంటే వారికి పండగే!
డ్రంకెన్ డ్రైవ్ కేసులంటే స్టేషన్ రైటర్లు, కోర్టు కానిస్టేబుళ్లకు పండగే. కోర్టుకు వెళ్తే శిక్షలు ఖాయమని మందుబాబులను బెదిరించి భారీగా దండుకుంటున్నారు. ఇలాంటి వసూలు రాజాలు కర్నూలు ట్రాఫిక్ స్టేషన్‌తో పాటు సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్లలో హవా సాగిస్తున్నారు. రూ.10 వేలు వసూలు చేసి కోర్టులో రూ.5 వేలు చెల్లించి మిగతా మొత్తాన్ని నొక్కేస్తున్నారు. జప్తు చేసిన వాహనాలను వారికి అప్పగించేందుకు కూడా మరికొంత మొత్తం వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అందుకే ఆ కేసులంటే వారికి ఉత్సాహం. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. నెలలో కనీసం ఒక్కొక్క స్టేషన్ పరిధిలో 100కు పైగా డ్రంకెన్ డ్రైవ్, 150కి పైగా ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదవుతుంటాయి. ఆయా కేసుల్లో భారీగా స్కామ్ జరిగినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.


