● రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్
కర్నూలు(సెంట్రల్) : రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా బ్లాక్ స్పాట్లలో చేపడుతున్న పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లారోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని ఆమె నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పెద్ద పాడు నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిని లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు ప్రతిపాదిత ప్రాంతాన్ని మునిసిపల్, ఆర్‌అండ్‌బీ, ఏపీఎస్ ఆర్టీసీ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయాలని చెప్పారు. పంచలింగాల టోల్‌గేట్ నుంచి వెల్దుర్తి వరకు, ఆదోని పట్టణంలో నూతన బైపాస్ రోడ్డు నుంచి మంత్రాలయం వరకు గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను త్వరగా చేపట్టాలన్నారు. గత సమావేశాల్లో కర్నూలు నగర శివారులోని పిస్తా హౌస్ నుంచి ఉలింద కొండ వరకు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో హైమాస్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చామని, ఆ పనులు ఎంత వరకు వచ్చాయని జాతీయ రహదారుల అధికారులను ప్రశ్నించారు. కిడ్స్ వరల్డ్ నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలని మునిసిపల్, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఉల్చాల జంక్షన్ అభివృద్ధికి సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి పనులు పూర్తయ్యాయని, సుందరీకరణలో భాగంగా చేపట్టిన గుంతలు పూడ్చే పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు.
జాతీయ రహదారుల వెంట ఆక్రమణలు తొలగించాలి
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు జాతీయ రహదారుల వెంటనే అనధికార అక్రమణలు, అక్రమ పార్కింగ్‌లను తొలగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సంయుక్త తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి 44 లో ఈనాడు కార్యాలయం నుంచి మిస్ట ర్ ఇడ్లీ వరకు సర్వీసు రోడ్లపై ఉన్న ఆక్రమణల తొలగింపున కు సంబంధించి మునిసిపల్, జాతీయ రహదారులు, రెవె న్యూ శాఖలు సంయుక్తంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని నేషనల్‌హైవే డెప్యూటీ కలెక్టర్‌ను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, డీటీసీ శాంతకుమారి, పీఆర్ ఎస్‌ఈ ప్రభాకరరరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కామేశ్వరప్రసాదు, నేషనల్ హైవే స్పెషల్ డె ప్యూటీ కలెక్టర్ సునీత ఆర్‌టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు.


