కర్నూలు (అర్బన్): రాష్ట్ర ఉత్తమ వసతి గృహ సంక్షేమ అధికారిణిగా నగరంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహం నెంబర్–1 హెచ్‌డబ్ల్యూఓ బి.బెన్నమ్మ ఎంపికయ్యారు. ఈ మేరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమెకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ మల్లికార్జున నాయక్, డైరెక్టర్ లావణ్య వేణి అవార్డును అందించారు. అలాగే ఈ విద్యాసంవత్సరంలో అదే వసతి గృహంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన ఎ.రూప (960), ఎస్.లక్ష్మిదేవి (957)లను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా శనివారం వసతి గృహ సంక్షేమాధికారిణి బెన్నమ్మ మాట్లాడుతూ.. జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి జి.రాధిక, సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటి సలహాలు, సూచనలతో ప్రోత్సాహాన్ని అందించడంతో పలువురు విద్యార్థినులు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రస్థాయిలో విద్యార్థినులు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారన్నారు. ఇలాగే ప్రతి ఏడాది విద్యార్థినులు ఉత్తమ మార్కులు సాధించేందుకు మరింత కృషి చేస్తామని చెప్పారు.


