కర్నూలు సిటీ: కేసీ కాలువ జీవనాడిగా ఉన్న సుంకేసుల బ్యారేజీ గేట్ల లీకేజీలు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని మళ్లీంచే బ్యారేజీ నిర్వహణను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో వారంలో ఖరీఫ్ సీజన్ మొదలుకానుంది. ఇలాంటి సమయంలో బ్యారేజీ గేట్లతో పాటు, అత్యవసరమైన పనులు చేసేందుకు నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం ఆ వైపుగా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ ఏడాది కూడా గేట్లకు శాశ్వత మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతేడాది గేట్లకు రోప్‌లు, తాత్కాలికంగా లీకేజీల అరికట్టే పనులు చేసినా నిధుల కొరతతో చేసిన పనులకు సకాలంలో బిల్లులు ఇవ్వక మూడు గేట్లకు మాత్రమే రబ్బర్ సీళ్లు మార్పులు చేశారు. మిగిలిన గేట్లకు మార్చకపోవడంతో లీకేజీలు అవుతూనే ఉన్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు జల వనరుల శాఖలోని మెకానికల్ విభాగం ఇంజినీర్లు ప్రాజెక్టు గేట్ల పనితీరును పరిశీలించి సీజన్ ముందు, సీజన్ తరువాత పరిశీలించిన నివేదిలను ప్రభుత్వాలకు అందజేయాల్సి ఉంది. అయితే ఆ విభాగం ఇంజినీర్లు ఏ సీజన్‌లో వస్తున్నారో.. ఎప్పుడు ఏ నివేదికలు ఇస్తున్నారో కూడా ఆ శాఖ ఇంజినీర్లకు, ఆయా ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఇంజినీర్లకు సైతం తెలియడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మెకానికల్ విభాగం నిర్లక్ష్యం
ఏటా తాత్కాలిక మరమ్మతులతో
సరిపెడుతున్న వైనం
వందల క్యూసెక్కుల నీరు
వృథాగా దిగువకు


