పల్లెలతో పాటు పట్టణాల్లో పెరుగుతున్న ఆదరణ
అంతరించిపోతున్న కళకు తిరిగి ప్రాణం
ఆసక్తి చూపుతున్న మహిళలు
పండుగలు, ఉత్సవాలు, పెళ్లి వేడుకల్లో ప్రదర్శనలు
ఆధ్యాత్మికతకు.. శారీరక దృఢత్వానికి ప్రతీకగా నిలిచే మన సంప్రదాయ జానపద కళ ‘కోలాటం’ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. రెండు కర్రలు తాకడంతో శ్రావ్యంగా వినిపించే శబ్దం, లయబద్ధంగా సాగే నృత్యంతో అలరించే ఈ కళను నేర్చుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా నిత్యం ఇంటి పనులతో బిజీగా ఉండే గృహిణులు కోలాటం నేర్చుకోవడంపై ఆసక్తి చూపడం విశేషం.
కర్నూలు కల్చరల్: పల్లెలు సంప్రదాయ కళలకు పుట్టినిల్లు. గతంలో పగటివేళ పనులతో అలసిపోయిన గ్రామీణులు రాత్రివేళల్లో భజనలు, కోలాటాల ప్రదర్శనలతో మానసికోల్లాసాన్ని పొందేవారు. నేటి ఆధునిక యుగంలో కాలక్రమేణా వచ్చిన మార్పులతో సంప్రదాయ కళలు చాలా వరకు అంతరించిపోతున్నాయి. ప్రజల్లోనూ ఎంతో మార్పు వచ్చింది. క్షణం తీరిక దొరికినా సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సంప్రదాయ కళ సమూహ నాట్యం కోలాటంపై కొందరు మక్కువ చూపుతూ పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని మహిళలు, చిన్నారులు, యువకులు కోలాటం నేర్చుకుంటున్నారు. తమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగే ఉత్సవాల్లో కోలాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం వేడుకలు, శుభకార్యాల్లో కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రగుకుల తిలకా రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, బుజ్జిబుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య వంటి ఆధ్యాత్మిక పాటలు, కట్ట మీద పోయే అలకల చిలక, భలే బాగుంది బాల, బాగుందమ్మా బాగుందమ్మా వంటి సంప్రదాయ జానపద పాటలతో పాటు సినిమా పాటలకు సైతం కోలాట ప్రదర్శన చేస్తున్నారు. కోలాటానికి సంబంధించి అనేక పాటలు మనస్సుకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. ఇక ఈ పాటలకు కళాకారులు ప్రదర్శించే నృత్యం చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్లుగా ఉంటాయి.
వయస్సుతో సంబంధం లేకుండా...
ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లోని మహిళలు, ముఖ్యంగా గృహిణులు కోలాటం నేర్చుకుంటున్నారు. ఈ కళ నేర్చుకునే వారిలో పిల్లలే కాక పెద్దలు కూడా ఉంటున్నారు. వయో భేదం, హోదాలు పక్కన పెట్టి కోలాట ప్రదర్శన చేయడాన్ని విశేషంగా చెప్పవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం పండుగలు, ఉత్సవాల్లో కోలాట ప్రదర్శనలు చేసేందుకు వెళ్తున్నారంటే ఆ ఆటపై మహిళలకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. క్షణం తీరిక లేని ఈ రోజుల్లో గృహిణులు సమయం కేటాయించుకుని కోలాటం నేర్చుకుంటున్నారు.
వివాహ వేడుకల్లోనూ...
ప్రస్తుతం వివాహ వేడుకల్లో కూడా కోలాటం స్టేటస్ సింబల్‌గా మారింది. పెద్దపెద్ద హోదాల్లో ఉన్నవారు వివాహాల్లో కోలాట ప్రదర్శన ద్వారా వధూవరులను వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఇందుకోసం వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా కళాకారులతో కోలాట ప్రదర్శన చేయిస్తున్నారు. మరికొంతమంది వధూవరులకు సంబంధించిన బంధువులే కోలాటం వేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నారు. ఒకే డ్రస్ కోడ్‌తో కోలాటం చేస్తున్నారు. డ్రస్ కోడ్ ఎంపికపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటం కోలాటంపై మహిళలకు ఉన్న మక్కువను తెలియజేస్తుంది.


