నిరుపయోగంగా ఉన్న సంస్కృతోన్నత పాఠశాల
మూతపడిన బ్రాహ్మణపల్లె ఎంపీపీ పాఠశాల
నంద్యాల(అర్బన్): పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల విద్య ప్రశ్నార్థకంగా మారింది. బడిఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండాలని చంద్రబాబు ప్రభుత్వం లక్షలు వెచ్చిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ నియోజకవర్గమైన నంద్యాల మండలంలో జెడ్పీహెచ్‌ఎస్ 9, 3 ఎంపీయూపీ, 39 ఎంపీపీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు సంస్కృతోన్నత పాఠశాలలు ఉండగా అందులో నంద్యాల మండలం కానాల గ్రామ మజరా హైస్కూల్ కొట్టాల గ్రామంలో ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్య తగ్గిందంటూ పాఠశాలను మూసివేశారు. సంస్కృతం చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు అయోమయాలకు గురయ్యారు. మామూలు విద్య అయితే ఏదో ఒక పాఠశాలలో చదివేవారు. కాని సంస్కృత పాఠశాల కావడంతో విద్యార్థులు కొంత మంది బడి మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా బ్రాహ్మణపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ కావడంతో మూతవేశారు. అక్కడ విద్యాభాస్యం చేసే చిన్నారులు సుదూర ప్రాంతాలకు వెళ్లలేక బాల కార్మికులుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. పాండురంగాపురం మజరా సుబ్బారెడ్డి పాలెం ఎంపీపీ పాఠశాల కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే మూత దశకు చేరుకుంది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ నంద్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నంద్యాల మండలంలోని పాఠశాలలు మూతపడి విద్యార్థులు బాల కార్మికులుగా మారుతున్నా మంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకొని మూత పడిన పాఠశాలను తెరిచి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని కోరుతున్నారు.
విద్యార్థులు లేక మూడు ప్రభుత్వ
పాఠశాలల మూత
సుదూర ప్రాంతాలకు వెళ్లలేని
పేద విద్యార్థులు
బాల కార్మికులుగా మారుతున్న
చిన్నారులు


