కర్నూలు సిటీ: జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నగర శివారులోని దుపాడు దగ్గర ఉన్న ఐయాన్ డిజిటల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 973 మంది విద్యార్థులు హాజరయ్యారు. అడ్వాన్డ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ)రాయల్సి ఉంటుంది. ఈ పరీక్ష వచ్చే నెల 1న రిజిస్ట్రేషన్ చేసుకుంటే, 4వ తేదీన పరీక్ష నిర్వహించి, 7వ తేదీ తుది ఫలితాలు ప్రకటించనున్నారు. అడ్వాన్డ్స్ పరీక్షకు హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ 21న వెబ్‌సైట్‌లో ఉంచి 25వ తేదీ ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 1వ తేది ఉదయం 10 గంటలకు తుదికీ ఫలితాలను విడుదల చేయనున్నారు. పేపర్–1, పేపర్–2 రెండు పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను మాత్రమే విడుదల చేయనున్నారు. జూన్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు జోసా (జాయింట్ సీట్ అలకేషన్ ఆథారిటీ–జేఓఎస్‌ఏఏ) కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
ఉదయం 9.30 గంటలకే పీజీఆర్‌ఎస్
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి అధికారులు అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు meekoram.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.


