ఎమ్మిగనూరుటౌన్: ప్రైవేట్ పేరుతో ఆర్టీసీ నిర్వీర్యానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎంప్లాయీస్ యునియన్ వర్కింగ్ ప్రసిడెంట్ బసవరాజు అన్నారు. ఎమ్మిగనూరు డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా రాష్ట్రంలో 12 ఆర్టీసీ డిపోలను పినాకిల్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఆయా డిపోల్లో పనిచేసే సిబ్బందిని ఇతర డిపోలకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తే ఆర్టీసీలో పనిచేసే సిబ్బందితోనే నడపాలన్నారు. సీ్త్రశక్తి పథకం విజయవంతం కావాలంటే ఆర్టీసీకి 3 వేల బస్సులు మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న 10వేల పోస్టులను భర్తీ చేయాలన్నారు. పాత టిమ్స్ మిషన్ల స్థానంలో కొత్తవి ఇవ్వాలని కోరారు. ధర్నాలో గ్యారెజీ కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, అధ్యక్షుడు శ్రీనివాసులు,సిబ్బంది పాల్గొన్నారు.


