పత్తికొండ రూరల్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా వ్యవహరించడం టీడీపీకి తగదని రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు టి.కె.జనార్ధన్, రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో టీచర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు ఎ.నాగరాజు అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఉపాధ్యాయ సంఘం నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ ిపీఆర్‌సీ వెంటనే ఏర్పాటుచేసి 30శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. వేతన సవరణ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు. ఇప్పటి వరకు నాలుగు డీఏలను పెండింగ్‌లో పెట్టారని, ఐఆర్‌పై ఎలాంటి ప్రకటన చేయకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. అలాగే పెండింగ్‌లోని ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపుపై ఒక ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న, మండల ప్రధాన కార్యదర్శి మారుతి, నాయకులు వెంకటేశ్వర్లు, బలరాముడు పాల్గొన్నారు.


