నృత్యం.. నవరసభరితం | - | Sakshi
Sakshi News home page

నృత్యం.. నవరసభరితం

Apr 29 2026 7:42 AM | Updated on Apr 29 2026 7:42 AM

● నృత్యం నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్న యువతీ యువకులు ● నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం

● నృత్యం నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్న యువతీ యువకులు ● నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం

కర్నూలు కల్చరల్‌: నృత్యం కేవలం శరీర కదలిక మాత్రమే కాదు.. భావాల వ్యక్తీకరణ.. సంస్కృతుల కలయిక.. శాసీ్త్రయ నృత్య రీతులు భారతీయ సంస్కృతికి ప్రతిరూపాలు. నవరసాల్లో ఒదిగిన ఈ నాట్య కళ మనిషి సర్వోతముఖ వికాసానికి సాధనం. ఈ కళ సాధనతో ఏకాగ్రత, ఆత్మస్థైర్యం, పట్టుదల, జ్ఞాపక ఽశక్తి పెరుగుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. నృత్యకారుడు జీన్‌ జార్జెస్‌ నొవెర్రి జన్మదినం ఏప్రిల్‌ 29 సందర్భంగా ఏటా ‘అంతర్జాతీయ నృత్య దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.

సర్వ సంపన్నం.. నాట్య కళ

మనసులోని భావాలను వెల్లడించేందుకు ప్రదర్శనా రూపంగా ఎంచుకున్న కళ నృత్యం. హావభావాలకు లయ, సంగీతం జోడించి మరింత ఆహ్లాదంగా కంటికింపు కలిగేలా నృత్యాన్ని సృష్టించారు పూర్వీకులు. సామాజిక దృక్పథాన్ని, పురాణ ఇతిహాసాలను మంచి చెడులను ప్రచారం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నృత్య కళాకారులు, నృత్య శిక్షకులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ జిల్లాకు గుర్తింపు తెస్తున్నారు.

ఆధునిక నృత్య రీతులు అదుర్స్‌

శాసీ్త్రయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడితో పాటు ఆధునికమైన అనేక నృత్యరీతులు ప్రచారంలోకి వచ్చాయి. బెల్లీ, గంగ్నమ్‌, సల్సా, జుంబా, ట్వెర్కింగ్‌, సాంబా, మాంబో వంటి ఆధునిక నృత్య రీతులకు చిన్నారులు, కుర్రకారు దాసోహం అంటున్నారు. జిగేల్‌ మనే నియాన్‌ దీపాల వెలుగులు, లౌడ్‌ స్పీకర్లకే చిల్లులు పడతాయా అన్నట్లుగా హోరెత్తే శబ్దాలు, లోకాన్ని మరిచిపోయి డీజేలు సృష్టిస్తున్న సంగీత హోరులో యువతరంగాలు ఊగిపోతున్నారు.

శిక్షణా సంస్థలకు డిమాండ్‌

జిల్లాలో నృత్య శిక్షణ కేంద్రాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదయం, సాయంకాలం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ శారదా సంగీత, నృత్య కళాశాల రాయలసీమలోనే ఏకై క శిక్షణ కేంద్రం. ఇక్కడ సంగీతంతో పాటు శాసీ్త్రయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ కళాశాలలో వివిధ జిల్లాల విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని, డోన్‌, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, మంత్రాలయం, కోడుమూరు ఇలా అన్ని పట్టణాల్లో నృత్య శిక్షణ కేంద్రాలు వెలిశాయి. వేసవి సెలవుల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. వారాంతాల్లో కూడా తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. శాసీ్త్రయ నృత్యంతో పాటు ఆఽధునిక, పాశ్చాత్య నృత్య రీతులకు అదే స్థాయిలో ఆదరణ లభిస్తోంది. సరదాగా నేర్చుకునే వారు ఆధునిక రీతులపైనే ఆసక్తి చూపుతున్నారు. టీవీ గేమ్‌ షోల్లో పాల్గొనాలన్న ఆసక్తితోనే ఎక్కువ మంది స్వల్ప కాలిక కోర్సుల్లో చేరి శిక్షణ పొందుతున్నారు.

పెరుగుతున్న ఆసక్తి

నృత్యం కొందరికి సర్వస్వం. మరికొందరికి జీవనోపాధి. ఇంకొందరికి సరదా. మొత్తం మీద సంప్రదాయ నృత్య కళలకు ఆదరణ నానాటికీ పెరుగుతోంది. అదే సమయంలో ఆధునిక నృత్యాలపై ఆసక్తి పెరుగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెరుగుతున్న నృత్య శిక్షణ కేంద్రాలే దీనికి నిదర్శనం. ఆసక్తిగా నేర్చుకుంటున్న వారి లో చిన్న పిల్లలు, యువత, ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. ఉద్యోగులు, గృహిణులు సైతం ఉత్సాహంగా నేర్చుకొని ప్రదర్శనలు ఇస్తున్నారు. గేమ్స్‌ షోల ప్రభావంతో నృత్యం నేర్చుకునేందుకు మహిళలు ముందుకు వస్తున్నారు. వీరిలో ఆధిక శాతం స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు.

నృత్య శిక్షణ కేంద్రాల వివరాలు

ఉమ్మడి జిల్లాలో నృత్య శిక్షణ కేంద్రాలు: సుమారు 200

కర్నూలు నగరంలో..: 25

కోర్సుల వివరాలు:

ప్రభుత్వ నృత్య కళాశాలలో:

4 ఏళ్ల సర్టిఫికెట్‌ కోర్సు

2 ఏళ్ల డిప్లొమా కోర్సు

ప్రైవేట్‌ శిక్షణ కేంద్రాల్లో:

సంప్రదాయ నృత్యం : ఏడాది కోర్సు

పాశ్చాత్య నృత్యం: 3 నెలలు

Advertisement
 
Advertisement
Advertisement