కర్నూలు (అర్బన్): జిల్లాలో బాల్య వివాహాలను నివారించేందుకు క్షేత్రస్థాయి కమిటీలను బలోపేతం చేయాలని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ టి.శారద సూచించారు. ఆమె మంగళవారం నగర శివారులోని బి.తాండ్రపాడు డీఆర్‌డీఏ శిక్షణ కేంద్రంలో బాల్య వివాహాల నివారణపై పొదుపు సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. యువతికి 18 సంవత్సరాలు, యువకుడికి 21 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహం చేయాలన్నారు. గ్రామస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు కమిటీలు శ్రద్ధ చూపాలన్నారు. బాల్య వివాహాల వల్ల అనేక రకాల అనర్థాలు, ఇబ్బందులు, శారీరక, మానసిక సమస్యలు వస్తాయన్నారు. చిన్న వయసులో వివాహాలు చేస్తే రూ.లక్ష జరిమానాతో పాటు రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందన్నారు. గ్రామస్థాయిలో బాల్య వివాహ నిషేధ అధికారులైన పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, మహిళా పోలీసులు తమ పరిధిలో బాల్య వివాహాల నిర్మూలనకు కచ్చితంగా జీఓ నంబర్ 31 ప్రకారం విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలో అర్బన్, సెమీ అర్బన్ పిల్లలు, గ్రామస్థాయిలో తల్లిదండ్రులు చదివించుకోలేని స్థితిలో ఉన్న బాలల వివరాలను తమ దృష్టికి తీసుకొస్తే అలాంటి వారిని సీడబ్ల్యూసీ ముందు హాజరుపరచి వారికి విద్య, వసతి, పునరావాసం కల్పించేందుకు జిల్లాలోని పత్తికొండ, పెద్దపాడులోని బాలసదన్‌లో ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. డిస్ట్రిక్ట్ హ్యుమనైజేషన్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.ఉమ మాట్లాడుతూ.. టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల పుట్టబోయే పిల్లలు అనారోగ్యం, తక్కువ బరువు, అంగ వైకల్యంతో పుడతారన్నారు. కొన్ని సందర్భాల్లో మాతృ, శిశు మరణాలు కూడా సంభవించే ప్రమాదాలు ఉంటాయన్నారు. దిశ సీఐ మస్తాన్ వలి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల ఆపదలో ఉన్న సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.


