కర్నూలు(హాస్పిటల్): ఇటీవల కాలంలో మానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విద్యార్థులకు చదువు, యువతకు నిరుద్యోగం, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారులు, ఉద్యోగులకు ఆర్థిక సమస్యలు, ఇతర ఒత్తిళ్లు, ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక సమస్యలకు గురై నిద్రలేమితో బాధపడుతున్నారు. వీరికి చికిత్స అందించే వైద్యులు రెగ్యులర్ మందులతో పాటు నిద్ర, ఒత్తిడి, ఆందోళన తగ్గించే మందులు సైతం సూచిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3,150 దాకా రిటైల్ మెడికల్ షాపులు, 550 దాకా హోల్‌సేల్ మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా ఏటా దాదాపు రూ.300 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఔషధ నియంత్రణ శాఖ పరిధిలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తున్నారు. వీరు ఆయా దుకాణాల్లో ఫార్మాసిస్టుల వివరాలతో పాటు ఔషధాల క్రయ విక్రయాల గురించి తరచూ ఆరా తీస్తుంటారు. ఇదే సమయంలో వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారా, కాలం తీరిన మందు లు ఏమైనా విక్రయిస్తున్నారా అని కూడా పరిశీలిస్తుంటారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని దుకాణాలపై తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు.
ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు
గత సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్‌షాపులపై అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రజల్లా వచ్చి ప్రిస్కిప్షన్ లేకుండా నిద్ర మాత్రలు అడిగి కొని మరీ కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో పలు దుకాణదారులకు నోటీసులు అందడమే గాక కొన్ని రోజుల పాటు సస్పెన్షన్‌కు కూడా గురి అయ్యారు. దీంతో అధిక శాతం మెడికల్‌షాపుల్లో ఏడాది నుంచి ప్రిస్కిప్షన్ లేకుండా నిద్రమాత్రలు, మత్తును కలిగించే నొప్పి మాత్రలు, ఆందోళన, డిప్రెషన్ మాత్రలు విక్రయించడం లేదు. వాటిని రెగ్యులర్‌గా వాడే రోగులైతే తాజాగా వైద్యులను కలిసి ప్రిస్కిప్షన్ రాయించుకుని రావాలని సూచిస్తున్నారు.
రోగులకు ఖర్చు తడిసి మోపెడు
మత్తును కలిగించే మందులు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించకూడదన్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ ఇది రెగ్యులర్‌గా వాడే రోగులకు కూడా కఠిన తరం చేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా వైద్యుల ప్రిస్కిప్షన్ తెస్తేనే చాలా దుకాణాల్లో ఈ మందులు ఇస్తున్నారు. ప్రతిసారీ వైద్యుల వద్దకు వెళ్లాలంటే ఆ రోజు సమయంతో పాటు డాక్టర్ ఫీజు, ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులు కూడా కలిసి భారం తడిసి మోపెడవుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దురలవాట్లకు బానిసలైన వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా రెగ్యులర్‌గా మందులు వాడే వారికి ఇది శరాఘాతంగా మారింది.
పెరిగిపోతున్న మానసిక సమస్య బాధితులు
తాజా ప్రిస్కిప్షన్ లేకుండా
మందులివ్వని దుకాణాలు
ప్రతిసారీ డాక్టర్ వద్దకు
వెళ్లాలంటే కష్టమంటున్న
బాధితులు
లిక్కర్‌కు లేని ఆంక్షలు
ఈ మందులకు ఎందుకని ప్రశ్న
మద్యానికి లేని ఆంక్షలు ఔషధాలకెందుకు?
ప్రస్తుతం వీధి వీధిలో మద్యం దుకాణాలు ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా కొనసాగుతున్నాయి. మద్యానికి కొనేందుకు ఎలాంటి ప్రిస్కిప్షన్ అవసరం లేదు. దీనికితోడు ఔషధాల కంటే పదింతలు మత్తును ఇవి కలిగిస్తాయి. మద్యానికి బానిసలై చాలా మంది జీవితాలు ఛిద్రమవుతున్నాయి. కొందరి ఆరోగ్యం దెబ్బతింటుండగా, మరికొందరు ప్రమాదాల్లో గాయపడుతుండగా, ఇంకొందరు మరణిస్తున్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. అయినా, మద్యం విక్రయాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. నిద్ర, ఒత్తిడి, ఆందోళన తగ్గించే మాత్రలు వాడటం వల్ల ఆ రాత్రికి రోగులకు నిద్రపట్టడమే గాక వారి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తోంది. కానీ ఔషధాలపై ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఎందుకు పెట్టడం లేదని రోగులు ప్రశ్నిస్తున్నారు. మద్యం విక్రయాలపై లేని ఆంక్షలు ఒత్తిడిని తగ్గించే మందులపై ఎందుకని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


