కర్నూలు(సెంట్రల్): సీఐటీయూ రాష్ట్ర 17వ మహాసభల్లో భాగంగా ఏప్రిల్ 17వ తేదీన నంద్యాలలో కార్మికుల మహాప్రదర్శన ఉంటుందని, దానిని విజయంతం చేయాలని సీఐటీయూ న్యూసిటీ నగర అధ్యక్ష, కార్యదర్శులు వై.నగేష్, ఆర్.నరసింహులు కోరారు. ఆదివారం కార్మిక, కర్షక భవన్‌లో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర మహాసభలకు సభాధ్యక్షుడిగా వి.నాగేశ్వరరావు, ముఖ్యఅతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు ఎలమరం కరీం, సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కె.హేమలత, ఉపాధ్యక్షుడు ఎం.సాయిబాబా, కోశాధికారి సీహెచ్ నరసింగరావు, ఆహ్వాన సంఘం కార్యదర్శి ఎంఏ. గఫూర్ హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ మహాసభలకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్మికులు తరలి వెళ్లాలని కోరారు. కార్యక్రంలో కోశాధికారి సాయిబాబా, ఉపాధ్యక్షుడు సుధాకరప్ప, నాయకులు మహ్మద్‌రఫీ, ప్రభాకర్ పాల్గొన్నారు.
మూర్వకొండ బురుజు వద్ద
గుర్తుతెలియని మృతదేహం
పగిడ్యాల: మూర్వకొండ బురుజు వద్ద మునక భూముల్లో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైతులు గుర్తించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ పూర్తిగా తగ్గిపోవడం వలన రైతులు నువ్వుల పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో నువ్వుల విత్తనం వేసేందుకు పొలం వద్దకు చేరుకోగా అక్కడ కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, ఇన్‌చార్జ్ ఎస్‌ఐ ఓబులేసు, ఏఎస్‌ఐ శేషయ్య, కానిస్టేబుల్స్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద సెల్‌ఫోన్‌ను గుర్తించి సీజ్ చేశారు. అయితే మృతుడు ఎవ్వరన్నది గుర్తించలేదు. బ్యాక్‌వాటర్‌లో కొట్టుకుని వచ్చి ఉండొచ్చని శరీరంపై ఎలాంటి గాయాలు లేనందున అనుమానా స్పద మృతిగా భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. గ్రామ వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పొలాల్లోనే పోస్టుమార్టం నిర్వహిస్తామని సీఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో హార్వెస్టర్ ఆపరేటర్ మృతి
చాగమర్రి: విద్యుదాఘాతంతో హార్వెస్టర్ ఆపరేటర్ మృత్యువాత పడ్డాడు. ఎస్‌ఐ ఎం.రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మల్లెవేముల గ్రామానికి చెందిన వంగల విజయ కిషోర్(22) హార్వెస్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం కొలుములపేట గ్రామ పొలాల్లో చిన్న సుబ్బారెడ్డి పొలంలో హార్వెస్టర్‌తో సజ్జ పంట కోత చేపట్టారు. కాగా పొలంలో వెళ్లిన 11కేవీ విద్యుత్ తీగలు హార్వెసర్టకు అడ్డుగా ఉండటంతో తప్పించే ప్రయత్నంలో కిషోర్ విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాద సమయంలో హార్వెస్టర్‌పై ఉన్న బాలుడు ఇస్మాయిల్ వెంటనే కిందకు దూకడంతో ప్రాణాలు నిలిచాయి. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రైతులు వాపోయారు. అయితే పొలాల్లో పంట కోత సమయాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నప్పుడు విద్యుత్‌శాఖ అధికారుల అనుమతితో ఎల్‌సీ తీసుకోవాలని ఏఈ వెంకట కృష్ణయ్య తెలిపారు.
నందికొట్కూరు రూరల్: మే 17వ తేదీన నంద్యాలలో బేడబుడగ జంగం ఎస్సీ పునరుద్ధరణ కోసం జరిగే సభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని బేడబుడగ జంగం కాలనీలో ఎస్సీ పునరుద్ధరణ పోస్టర్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. అల్ప సంఖ్యాక కులాలకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం చిన్న చూపు చూడడం తగన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శంకర్, వెంకటేశ్వర్లు, శేఖర్, అలేకం, రాముడు తదితరులు పాల్గొన్నారు.


