కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి (మార్చి 31వ తేది) 90 శాతం పన్నులు వసూలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. బుధ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 484 గ్రామ పంచాయతీల్లో పన్నులు, పన్నేతరములకు సంబంధించి రూ.29.55 కోట్ల వసూలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. క్షేత్ర స్థాయిలోని డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శుల సమష్టి కృషి వల్ల రూ.25.01 కోట్లను వసూలు చేశామన్నారు. పన్నులకు సంబంధించి రూ.19 కోట్లను వసూలు చేయాల్సి ఉండగా రూ.17.20 కోట్లు, పన్నేతరములకు సంబంధించి 10.54 కోట్లలో రూ.7.80 కోట్లు వసూలయ్యాయన్నా రు. ఇదిలా ఉంటే ఈనెల 2వ తేదీతో గ్రామ పంచా యతీ సర్పంచుల పాలన ముగియనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారుల నియామకాలకు సంబంధించి జాబితా సిద్ధంగా ఉందన్నారు. ఈ జాబితాపై జిల్లా కలెక్టర్ ఆమోదముద్ర కూడా వేశారన్నారు. గతంలో ఉన్న విధంగానే ఎమర్జెన్సీ సర్వీసులు(మెడికల్, విద్యుత్) మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులకు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించామన్నారు. ఈ నెల 3వ తేది నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమవుతుందన్నారు.


