న్యాయ శాఖ ఉద్యోగాల రాత పరీక్ష రద్దు | - | Sakshi
Sakshi News home page

న్యాయ శాఖ ఉద్యోగాల రాత పరీక్ష రద్దు

Apr 2 2026 7:23 AM | Updated on Apr 2 2026 7:23 AM

కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌ కోఆర్డినేటర్‌ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష రద్దు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (అమరావతి) ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఉద్యోగ నియామకాలకు ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం రికార్డు అసిస్టెంట్‌, ఫ్రెంట్‌ ఆఫీస్‌ కోఆర్డినేటర్‌ పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరి 18న కర్నూలులోని ప్రసూనా లా కళాశాలలో రాత పరీక్షలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు వీటిని రద్దు చేసి మళ్లీ రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు లీలా వెంకటశేషాద్రి వెల్లడించారు. పూర్తి వివరాలు జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని పేర్కొన్నారు.

పీఆర్‌ ఎస్‌ఈ బాధ్యతల స్వీకరణ

కర్నూలు(అర్బన్‌): పంచాయతీరాజ్‌ పర్యవేక్షక ఇంజనీరుగా జి.ప్రభాకర్‌రెడ్డి బుధ వారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్‌ఈగా విధులు నిర్వహించిన ఐ.వేణుగోపాల్‌ గత మార్చి 31న పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో అనంతపురం పీఆర్‌ఐ డివిజన్‌లో ఈఈగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్‌రెడ్డికి ఇటీవలే ఎస్‌ఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు పోస్టింగ్‌ ఇచ్చారు. ఎస్‌ఈగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్‌రెడ్డిని ఈఈ మహేశ్వరరెడ్డి, డీఈఈలు పీఏ టు ఎస్‌ఈ బండారు శ్రీనివాసులు, కర్రెన్న, నాగిరెడ్డి, ఏఈ, ఏఈఈ, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలులో ఏర్పాటైన స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించి ఉద్యోగ ఖాళీల భర్తీకి 29.01.2024న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా జాబితాలను కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్‌సైట్‌లు https:// kurnool.ap.gov.in,https://nandyal.ap.gov.in,https://kurnoolmedicalcollege.ac.inలో ఉంచామన్నారు. ఎంపికై న అభ్యర్థులు వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, నకలుతో ఈ నెల 7వ తేది ఉదయం 10.30 గంటలకు ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించారు. హాజరుకాని అభ్యర్థుల ఎంపిక రద్దు చేస్తామన్నారు.

గృహ నిర్మాణ సమస్యలపై ఫోన్‌ చేయండి

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించుకుంటున్న గృహాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ప్రతి గురువారం తమ కార్యాలయంలోని ల్యాండ్‌ లైన్‌ 08518–257481 నెంబర్‌కు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కాల్‌ చేయాలని హౌసింగ్‌ పీడీ చిరంజీవి కోరారు. లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇళ్లకు రావాల్సిన గృహ నిర్మాణ సామగ్రి, సిమెంట్‌, స్టీల్‌, బిల్లుల గురించి ఫోన్‌ చేయాలని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే పీఎంఏవై 2.0 అర్బన్‌ గృహాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఫోన్‌ చేసి సంప్రదించాలని కోరారు.

పలు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

కర్నూలు(హాస్పిటల్‌): రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కోసం ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు బుధవారం నుంచి జిల్లాలో ఎన్‌టిఆర్‌ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) సేవలు బంద్‌ చేశాయి. ఈ మేరకు జిల్లాలో మెజారిటీ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల కోసం వచ్చిన రోగులను వెనక్కి పంపించాయి. ఆపరేషన్లను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. జిల్లాలో ప్రైవేటు రంగంలో 60 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉండగా, మొదటి రోజు బుధవారం 36 ఆసుపత్రులు బంద్‌ పాటించాయి. 24 ఆసుపత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాయి. గురువారం నుంచి మరికొన్ని ఆసుపత్రులు సేవలు బంద్‌ చేసేందుకు నిర్ణయించాయి. కొత్తగా వచ్చిన రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అందించకుండా ఇప్పటికే ఆసుపత్రిలో చేరిన వారికి మాత్రం వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. కొన్ని ఆసుపత్రులు అత్యవసరమైన కేసులు మాత్రమే తీసుకుని, మిగిలిన కేసులను వాయిదా వేస్తూ, తర్వాత రావాలని పంపించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement