బనగానపల్లె రూరల్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన నందవరం చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం కనులపండువగా సాగింది. చౌడేశ్వరిదేవి రాయబారాది వసంతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన కార్యక్రమం సోమవారం ఉదయం ముగిసింది. ముందుగా శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి భాస్కరయ్య ఆచారితో అమ్మవారికి దిష్టిచుక్క పెట్టు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చిన తొగట వీర క్షత్రియులు, అమ్మవారి భక్తులు ముందుగానే గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం ప్రాంగణానికి చేరుకు న్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా నెయ్యి, గోధమ పిండి, వివిధ సుగంధ ద్రవ్యాలతో జ్యోతిని తయారు చేసుకొని వెలిగించుకొని తలపై పెట్టుకొని శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి గీతాలు ఆలపిస్తూ, మేళ తాళాలతో చౌడేశ్వరిదేవి ఆలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన నిప్పుల గుండంపై మొదట సర్కార్ జ్యోతితో భక్తులు నడిచిన తరువాత మిగిలిన భక్తులు వరుసగా నిప్పులపై నడుస్తూ తమ మొక్కులు చెల్లించారు. పలువురు ప్రముఖులు చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది దాదాపు 545 జ్యోతులతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం అమ్మ వారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. బనగానపల్లె, నంద్యాల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీస్‌లు ఏర్పాటు చేశారు. దేవస్థానంతో పాటు పలు అన్నదాన సంస్థలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్‌రెడ్డి, అర్బన్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐలు దుగ్గిరెడ్డి, భూపాలుడు, కల్పన ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆలయంలో కొలువైన
శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారు
వైభవంగా శ్రీ చౌడేశ్వరిదేవి
జ్యోతి మహోత్సవం
545 జ్యోతులతో ఊరేగింపు
ఆకట్టుకున్న తొగట వీరక్షత్రియుల
నృత్యాలు
జ్యోతులను తిలకించేదుకు
తరలివచ్చిన భక్తజనం


