● నీటిపారుదల శాఖ డీఈ ప్రసాద్‌కు విన్నవించిన రైతులు
పగిడ్యాల: ‘పంటలు ఎండిపోతున్నాయ్.. కాపాడండి’ అంటూ సోమవారం జిల్లపాడు, శాతనకోట, సుల్తానాపురం, మల్యాల గ్రామాల రైతులు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద నీటిపారుదల శాఖ డీఈ ప్రసాద్‌ను ఆశ్రయించి మొరపెట్టారు. ఎత్తిపోతల నీరు తమ పొలాలకు రావాలంటే క్రాస్ రెగ్యులేటర్ గేట్లను మూడు రోజుల పాటు పూర్తిగా బంద్ చేయా లని అభ్యర్థించారు. రెండు రోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ల ద్వారా ఎత్తిపోసే నీరంతా దిగువకు వెళ్తున్నాయని ఎగువ తూములకు పారడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. సాగునీరు రాకపోతే పంట చేతికి రాదని డీఈకి వివరించారు. డీఈ ప్రసాద్ మాట్లాడుతూ.. 0 నుంచి 120 కి.మీ. వరకు కేసీ కాలువ వెంట తనిఖీ చేస్తున్నామని తప్పనిసరిగా న్యాయం చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
ఆన్‌లైన్‌లోనే వాహన రిజిస్ట్రేషన్
నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే సాగుతుందని జిల్లా రవాణా అధికారి శివారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వాహన కొనుగోలు దారులు ప్రభుత్వం ఇచ్చిన రసీదును తీసుకొని, అందులో ఉన్న డబ్బులు మాత్రమే చెల్లించాలన్నారు. టెంపర్‌వరీ రిజిస్ట్రేషన్ ఫీజు, పర్మినెంట్ ఫీజు, పోస్టల్ ఫీజు, సర్టిఫికెట్ ఫీజు, రోడ్డు సేఫ్టీ, సర్వీస్, నంబర్ ప్లేట్ ఫీజులు వాహనాన్ని బట్టి మారుతాయన్నారు. ఆర్‌టీఓ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాలని షోరూం యజమానులు చెప్పిన మాటలు నమ్మవద్దని సూచించారు.
నాటుకోళ్లు మృత్యవాత
ఎమ్మిగనూరుసెంట్రల్: బోడబండ గ్రామంలో పైరాజ్యం తిక్కయ్యకు చెందిన 30 నాటుకోళ్లు, ఉలువ అడవిరాముడుకు చెందిన నాలుగు కోడి పుంజులు, రెండు నాటు కోళ్లు మృత్యవాత పడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు విషపూరిత ఆహారం పెట్టడంతో నాటుకోళ్లు మృత్యవాత పడ్డాయని వారు ఆరోపించారు. దాదాపు రూ. 30 వేలు నష్టపోయామని బాధితులు తెలిపారు.


