తమ దుకాణంలో మెడిసిన్‌పై 20 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఇటీవల కొన్ని మందుల దుకాణాలు బాహాటంగానే ప్రకటించుకుంటున్నాయి. ఇందులో కొన్ని కార్పొరేట్ దుకాణాలు కూడా ఉన్నాయి. ఇలాంటి చోట్ల మందులు కొన్న వినియోగదారులు నేరుగా ఎంత డిస్కౌంట్ ఇస్తారని అడిగి మరీ మందులు కొంటున్నారు. వాస్తవంగా బ్రాండెడ్ మందులపై రిటైల్ విక్రయదారులకు 18 శాతం వరకు మార్జిన్ ఉంటుంది. మరికొన్నింటిపై ఆఫర్ల మేరకు ఇంకా కొద్దిమేరకు ఎక్కువ లాభాలు వస్తాయి. కానీ జనరిక్, ప్రాపగండ కమ్ డిస్ట్రిబ్యూషన్(పీసీడీ) మందులపై రిటైలర్లకు 50 నుంచి 70శాతం వరకు లాభాలు ఉంటాయి. ఈ లాభాలను వినియోగదారులకు ఆయా దుకాణాలు ఇవ్వాల్సి ఉన్నా అధిక శాతం దుకాణాలు ఇవ్వడం లేదు. అడిగిన వారికి మాత్రం 10 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. అధిక శాతం దుకాణాలు వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్‌పై ఉన్న మందులు గాకుండా మా వద్ద ఉన్న మందులు కొంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందంటూ రోగులను నమ్మించి మరీ అంటగడుతున్నాయి. ఆయా మందులపై 25 శాతం డిస్కౌంట్ ఇచ్చినా అదనంగా 50 శాతం దుకాణదారులకు లాభం మిగులుతుంది. ఈ కారణంగా పీసీడీ మందులను అధికంగా విక్రయిస్తూ భారీగా డిస్కౌంట్‌లు ప్రకటించి వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయమై డ్రగ్ కంట్రోల్ అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధర విక్రయిస్తేనే చర్యలు ఉంటాయి గానీ తక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని చెప్పి ఊరుకుంటున్నారు.


