వెల్దుర్తి: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్, గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు అల్లూరి సీతారామరాజు జిల్లా రాళ్లగడ్డ గ్రామం కుర్ర రమేశ్. ఎస్‌ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. శనివారం హైవే 44పై మండల పరిధిలోని సూదేపల్లె క్రాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న కుర్ర రమేశ్‌ను వాహనాల తనిఖీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకుని సోదా చేశారు. అతని వద్ద అనుమానాస్పద మత్తుపదార్థాలు లభించడంతో ఎస్‌ఐ బృందం అప్రమత్తమయ్యారు. అక్కడికక్కడే తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, వ్యవసాయశాఖ, పంచాయతీ రాజ్ శాఖాధికారుల సమన్వయంతో పంచనామా చేశారు. 20గ్రాముల గంజాయి, ఎమ్‌డీఎమ్‌ఏ(నిషేధిక మత్తు పదార్థం–పార్టీ డ్రగ్) మత్తు పదార్థాలుగా గుర్తించారు. నిందితుడు కుర్ర రమేశ్‌ను విచారించగా బెంగళూరులోని వంశీ అను వ్యక్తి చెప్పిన మేరకు హైదరాబాద్‌లోని పార్టీ కోసం డ్రగ్స్ తీసుకువెళ్తున్నట్లు తెలుసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వెలుగోడులో దారుణం
● పదేళ్ల చిన్నారిపై
వృద్ధుడి అత్యాచారయత్నం
వెలుగోడు: పదేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు.. సీపీ నగర్ ప్రాంతంలో కార్పెంటర్ పని చేసే వృద్ధుడు చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని మాయమాట లు చెప్పి సమీపానికి రప్పించుకున్నాడు. అనంతరం అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దీంతో వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బాలిక తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సురేష్ విచారణ చేపట్టారు. చిన్నారిపై జరిగిన దారుణాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వేధింపులు తాళలేక మహిళ బలవన్మరణం
ఎమ్మిగనూరురూరల్: భర్త, మామ వేధింపులు తాళలేక భారతి(30) అనే మహిళ శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బసాపురం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన భారతి(30)తో తొమ్మిది ఏళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. గ్రామం సమీపంలోని పొలంలో గుడిసెవేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే భర్త నాగరాజు, మామ చిన్నబసప్ప భారతిని వేధింపులకు గురిచేసేవారు. వీరి వేధింపులు తాళలేక జీవితంపై విరక్తి చెంది పొలం దగ్గర ఉన్న గుడిసెలో ఒంటిపై పెట్రోల్‌పోసుకొని భారతి నిప్పంటించుకున్నారు. మంటలతో బయటకు కేకలు వేస్తు రావటంతో అక్కడ ఉన్న వారు మంటలు ఆర్పి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. తమ కుమార్తెను భర్త, మామలు కాల్చిచంపారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తండ్రి రామాంజనేయుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసలు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆదోని సెంట్రల్: గుంతకల్–నంచర్ల రైల్వేస్టేషన్‌ల మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ విషయాన్ని రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివరాములు వెల్లడించారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదానికి గురైడా అన్నది తెలియరాలేదన్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తించినట్లయితే గుంతకల్ రైల్వే పోలీసులకు లేదా సెల్ నంబర్: 9247575606ను సంప్రదించాలన్నారు.
జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని జింకా ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో 15 ఏళ్ల బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహిస్తున్న ఈ పోటీలను జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్ క్రీడ ఏకాగ్రతను ఇనుమడింపజేస్తుందన్నారు. చదువులో కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. మొబైల్ ఫోన్‌లో పిల్లల్లో దుష్ప్రభావం చూపుతుందని, పిల్లల దృష్టి క్రీడలపై ఉండేలా చూడాలన్నారు. విద్యతో పాటు క్రీడల్లో, కళల్లో పాల్గొనడం వ్యక్తిత్వ వికాసానికి దోహదమన్నారు. క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విజేతలు జూన్ నెలలో గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, జనార్దన్, టోర్నమెంట్ కో ఆర్డినేటర్ వెంకటరావు, ఆర్బిటర్ సుజాత, 150 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు.


